తెలుగు వారికి అందుబాటులోకి రాని బాహుబలి ది ఎపిక్
భారతీయ సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచిన బాహుబలి(bahubali) సిరీస్‌ను గతేడాది బాహుబలి: ది ఎపిక్(Bahubali the epic) పేరుతో ఒకే సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. సుమారు 3 గంటల 44 నిమిషాల నిడివితో రూపొందిన ఈ ప్రత్యేక వెర్షన్‌కు అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. డైరెక్టర్ రాజమౌళి(Rajamouli) సృష్టించిన విజువల్ గ్రాండియర్, ప్రభాస్(Prabhas) అద్భుత నటన, ఎంఎం కీరవాణి(MM Keeravani) సంగీతం, భారీ తారాగణం ప్రదర్శనలు కలిసి ప్రేక్షకులకు మరపురాని అనుభూతిని అందించాయి. అయితే థియేటర్లలో మంచి ఆదరణ పొందిన ఈ వెర్షన్ ఇప్పుడు ప్రేక్షకులకు అందుబాటులో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం బాహుబలి: ది ఎపిక్ తెలుగు వెర్షన్‌ను ఓటీటీ వేదికల్లో చూడాలనుకునే అభిమానులకు నిరాశే ఎదురవుతోంది. నెట్‌ఫ్లిక్స్(Netflix)లో కేవలం హిందీ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉండగా, తెలుగు ప్రేక్షకులు ఈ ప్రత్యేక ఎడిట్‌ను చట్టబద్ధంగా వీక్షించే అవకాశం లేకుండా పోయింది. ఆసక్తికరంగా ఇటీవల జపాన్‌లో ఈ సినిమాకు సంబంధించిన ఒరిజినల్ బ్లూ-రే ఎడిషన్ విడుదలైంది. ప్రధాన సినిమాతో పాటు మేకింగ్ ఆఫ్ బాహుబలి అనే ప్రత్యేక డిస్క్‌ను కూడా అందించారు. తెలుగు డీటీఎస్ ఆడియోతో విడుదలైన ఈ ఎడిషన్ అక్కడి అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ పొందుతున్నప్పటికీ, భారత ప్రేక్షకులకు మాత్రం అధికారికంగా అందుబాటులోకి రాలేదు.
ఇక ఫిజికల్ మీడియా విషయంలో కూడా భారత మార్కెట్, విదేశీ మార్కెట్ మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోంది. మన దేశంలో డీవీడీలు, బ్లూ-రే డిస్కుల వినియోగం దాదాపు తగ్గిపోయినా, అమెరికా, జపాన్ వంటి దేశాల్లో మాత్రం వాటి మార్కెట్ ఇంకా బలంగా కొనసాగుతోంది. అందుకే పుష్ప2(Pushpa2), రంగస్థలం(rangasthalam), అరవింద సమేత వీరరాఘవ(Aravinda Sametha Veera Raghava), కల్కి 2898 ఏడీ(Kalki2898AD), కేజీఎఫ్(KGF) వంటి భారీ విజయాలు సాధించిన సినిమాలు ఇప్పటికీ బ్లూ-రే రూపంలో విక్రయించబడుతున్నాయి. ఇదే నేపథ్యంలో బాహుబలి: ది ఎపిక్‌ను తెలుగు ప్రేక్షకులకు ఓటీటీలో అందుబాటులోకి తీసుకురావాలన్న డిమాండ్ అభిమానుల నుంచి మరింతగా వినిపిస్తోంది.








