అలియా తనకో రూల్? కస్టమర్లకో రూలా?
ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్(Alia Bhatt) మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. రీసెంట్ గా కపిల్ టాక్ షో(Kapil talk show) లో పాల్గొన్న టైమ్ లో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు నెటిజన్ల మధ్య పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. షోలో అతిథులందరికీ కాఫీ అందించగా, అలియా మాత్రం ప్రత్యేకంగా బ్లాక్ టీ కావాలని కోరినట్లు సమాచారం. అలియా కోరినట్టే ఆమెకు టీమ్ బ్లాక్ టీ అందించిన తర్వాత అందులో చక్కెర కలిపారా అని ఆమె అడిగిందని, కొద్దిగా చక్కెర వేసినట్లు చెప్పగానే ఆ టీని తిరిగి పంపించిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా చక్కెర ఆరోగ్యానికి మంచిది కాదని, పండ్ల రూపంలో లభించే సహజ చక్కెరను మాత్రమే తీసుకోవాలని ఆమె సూచించినట్లు కూడా పోస్టులు వైరల్ అవుతున్నాయి.
ఈ ఘటన వెలుగులోకి రావడంతో అలియా ఆరోగ్యంపై చూపుతున్న శ్రద్ధకు కొందరు ప్రశంసలు కురిపిస్తుండగా, మరికొందరు మాత్రం దీనిపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలు వ్యక్తిగత జీవితంలో అనుసరించే ఆరోగ్య నియమాలు, వారు ప్రచారం చేసే వాణిజ్య ఉత్పత్తుల మధ్య ఉండే వ్యత్యాసాన్ని నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే వ్యాఖ్యలు ఒకవైపు ఉంటే, మార్కెటింగ్ ఒప్పందాలు మరోవైపు భిన్నమైన సందేశాలను ఇస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో అలియా ప్రచారం చేస్తున్న సన్ఫీస్ట్ డార్క్ ఫాంటసీ(Dark Fantacy) కాఫీ ఫిల్స్ బిస్కెట్లపై కూడా సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. పోషక విలువల వివరాల ప్రకారం ఈ ఉత్పత్తిలో 100 గ్రాములకు 35 గ్రాములకుపైగా చక్కెర ఉండటాన్ని కొందరు ప్రస్తావిస్తున్నారు. దీంతో ఆరోగ్య సూచనలు చేసే ప్రముఖులు ప్రకటనల్లో కనిపించే ఉత్పత్తుల ఎంపిక విషయంలో కూడా మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలా అనే అంశంపై మరోసారి చర్చ తెరపైకి వచ్చింది.








