రుణాల పేరిట లంచాల వేట.. విజిలెన్స్ విచారణలో బయటపడ్డ షాకింగ్ నిజాలు
Telangana: రాజేంద్రనగర్ సర్కిల్లో పొదుపు సంఘాల మహిళలకు బ్యాంక్ రుణాలు మంజూరు చేయడంలో భారీ అవినీతి జరుగుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కుటుంబ అవసరాలు లేదా స్వయం ఉపాధి కోసం రుణాలు కోరిన మహిళలను అధికారులు నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పుతూ, లంచాలు అడుగుతున్నారని సమాచారం.
విజిలెన్స్ అధికారుల దృష్టికి..
దీనిపై సర్కిల్లోని పలు సంఘాల మహిళలు తిరుగుబాటు చేసి, అధికారుల ప్రమేయం లేకుండా నేరుగా బ్యాంకులకు లేఖలు రాశారు. విషయం విజిలెన్స్ అధికారుల దృష్టికి వెళ్లడంతో జరిగిన విచారణలో దిగ్భ్రాంతికరమైన నిజాలు బయటపడ్డాయి. రాజేంద్రనగర్ సర్కిల్లో 1,400 మంది మహిళలకు మంజూరైన రూ. 4.5 కోట్ల రుణం నుంచి రూ. 4.5 లక్షలు లంచాలకే ఖర్చయ్యాయని ఆధారాలు సేకరించారు.
ఫోన్ పే, గూగుల్ పే ద్వారా వసూలు..
ప్రతి రూ. లక్ష రుణానికి రూ. 1,000 కమీషన్ వసూలు చేస్తున్నట్లు విజయేందర్, లక్ష్మణ్, జె. ఉపేందర్, పి. విజయ్‌కుమార్ వంటి కమ్యూనిటీ ఆర్గనైజర్లు (సీవోలు) విచారణలో ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. వీరు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా కూడా డబ్బులు వసూలు చేసినట్లు ఆధారాలు సేకరించారు. లంచం అడిగినప్పుడు ప్రశ్నించిన వారిని విధుల నుంచి తొలగించడం, వారి స్థానంలో తమకు అనుకూలమైన వారిని నియమించుకోవడం ఈ సీవోలకు అలవాటుగా మారిందని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. నివేదిక ఆధారంగా, అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మహిళల వేధింపులను అరికట్టాలని అధికారులు కమిషనర్‌కు సిఫార్సు చేశారు.








