మధ్యలోనే ఆగే బస్సులు.. ట్రాఫిక్ కష్టాల్లో ప్రయాణికులు
RTC Buses: హైదరాబాద్‌లోని ప్రధాన మార్గాల్లో బస్సులు తరచూ బ్రేక్‌డౌన్ అవుతుండటంతో ట్రాఫిక్ స్తంభించిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా నానల్‌నగర్, ఖైరతాబాద్ జంక్షన్, మాసబ్‌ట్యాంక్ కట్టమైసమ్మ దేవాలయం వంటి ప్రాంతాల్లో బస్సులు మధ్యలోనే ఆగిపోవడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రయాణికుల సంఖ్య పెరగడంతో..
‘మహాలక్ష్మి’ ఉచిత ప్రయాణ పథకం ప్రారంభమైన తర్వాత ప్రయాణికుల సంఖ్య పెరగడంతో బస్సులపై అదనపు ఒత్తిడి పడుతోంది. కొత్త బస్సులు రాకపోవడం, నిర్వహణ లోపించడం వల్ల ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది.
వైరింగ్, పార్ట్స్ సమస్యల వల్ల..
విడిభాగాల కొరత, ఆయిల్ సకాలంలో మార్చకపోవడం వంటి కారణాల వల్ల బస్సులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. వైరింగ్, పార్ట్స్ సమస్యల వల్ల కొన్ని బస్సుల నుంచి పొగలు వస్తున్నాయి. డిపోలలో ఫిట్నెస్ పరీక్షలు నామమాత్రంగానే జరుగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి.
3200 బస్సులతోనే..
మహానగరానికి 7 వేల బస్సులు అవసరం ఉండగా, ఆర్టీసీ ప్రస్తుతం 3200 బస్సులతోనే నెట్టుకొస్తోంది. వీటిలో 500 ఎలక్ట్రిక్ బస్సులు కాగా, మిగిలినవి డీజిల్ బస్సులు. హైదరాబాద్ రీజియన్‌లో 15 సంవత్సరాలు దాటిన బస్సులు సుమారు 250, పదేళ్లు దాటినవి 350 ఉన్నాయి. సికింద్రాబాద్ రీజియన్‌లో 15 సంవత్సరాలు దాటినవి 300, 10 సంవత్సరాలు దాటినవి 300 ఉన్నాయి. ఈ పాత బస్సులు కాలుష్యాన్ని వెదజల్లడమే కాకుండా, రోజుకు 6 నుండి 8 ట్రిప్పులు తిరుగుతున్నాయి.








