ఆరెస్సెస్ కార్యక్రమానికి హాజరైన ముగ్గురు వీసీలు.. కేరళలో దుమ్ము దుమారం
తిరువనంతపురంలో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ కార్యక్రమం జరిగింది. ఆరెస్సెస్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కేరళకి చెందిన ముగ్గురు వైస్ ఛాన్సలర్లు కూడా పాల్గొన్నారు. వారు ఆరెస్సెస్ కార్యక్రమంలో పాల్గొనడంపై దుమ్ము దుమారం రేగుతోంది. కేరళలో తీవ్ర వివాదానికి కూడా కేంద్ర బిందువుగా మారింది.
దీనిపై కేరళ సీఎం వీడీ సతీశన్ తీవ్రంగా స్పందించారు. వారు ఆరెస్సెస్ కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని ఖండిస్తున్నామని, వారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అలా పాల్గొనడం సంప్రదాయాలకు విరుద్ధమని, అనుచితమైందన్నారు. ఆ ముగ్గురు వీసీలు వెంటనే ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వీసీ పదవికి వుండే గౌరవాన్ని వారు దిగజార్చారని దుయ్యబట్టారు.ఎవరు చేసినా సరే, మతతత్వాన్ని ప్రోత్సహించే ఏ చర్య అయినా ఆమోదయోగ్యం కాదు, దానిని సహించం అని ప్రకటించారు.
మరో వైపు మాజీ సీఎం పినరయ్ విజయన్ కూడా తీవ్రంగానే స్పందించారు.ఆరెస్సెస్ తన పట్టును విస్తరించుకునే క్రమంలో వుందని, విశ్వవిద్యాలయాల్లో ఆరెస్సెస్ ఎజెండాలను రుద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఉన్నత విద్యా రంగంపై తన పట్టును బిగించడానికి ఆర్ఎస్ఎస్ (RSS) ఎలా ప్రయత్నిస్తోందో చెప్పడానికి ఇది ఒక స్పష్టమైన ఉదాహరణ,” అని అన్నారు.
మరోవైపు కర్నాటక హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే కూడా తీవ్రంగానే స్పందించారు. వీసీలు ఆరెస్సెస్ కార్యక్రమాల్లో పాల్గొని, విద్యార్థులకు ఏం సందేశం పంపుతున్నారని ప్రశ్నించారు.ఆ సమావేశం నిర్దిష్ట భావజాలానికి సంబంధించిన సమావేశం అని అన్నారు.“వైస్ ఛాన్సలర్ వంటి పదవిలో ఉన్నప్పుడు, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు నిర్ణయించబడే మొత్తం విశ్వవిద్యాలయానికి వారే బాధ్యులు. ఒక నిర్దిష్ట భావజాలాన్ని ప్రచారం చేస్తూ, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించని ఈ ఆర్ఎస్ఎస్ సమావేశాలకు వెళ్తే ఎలా?’’ అంటూ ప్రశ్నించారు.
అయితే.. ఈ విమర్శలపై బీజేపీ కూడా అంతే ఘాటుగా స్పందించింది. ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఆ వీసీలను భయపెట్టే ప్రయత్నం చేస్తోందని కేరళ బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ మండిపడ్డారు.ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్లను వాడుకోవాలని వామపక్ష కూటమి, యూడీఎఫ్ (UDF) లక్ష్యంగా పెట్టుకున్నాయని ఆయన తీవ్రంగా విమర్శించారు. కేరళలో ప్రజల దృష్టిని మళ్లించడానికి ఆ కాషాయ పార్టీని ఉపయోగించుకునే రోజులు ఇక ముగిసిపోయాయని అన్నారు.








