‘‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ’’ లో విలీనమైన టీఎంసీ రెబెల్స్.. స్పీకర్ ని కలిసి లేఖ అందజేత
తృణమూల్ కాంగ్రెస్ రెబెల్ ఎంపీలు లోకసభ స్పీకర్ ఓంబిర్లాతో భేటీ అయ్యారు.తాము ‘‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ’’ లో విలీనం అవుతున్నామని, ఎన్డీయేకి మద్దతిస్తున్నామని స్పీకర్ కి తెలియజేశారు.ఈ మేరకు స్పీకర్ కి లేఖ సమర్పించారు. ప్రత్యేక పార్లమెంటరీ బృందాన్ని ఏర్పాటు చేయడంలో ఉన్న చట్టపరమైన చిక్కుల కారణంగా, తిరుగుబాటు టీఎంసీ ఎంపీలు ‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా’తో జతకట్టాలని నిర్ణయించుకున్నారు.
“మేము ‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ’లో చేరాము. అది గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీ. మేము అందులో విలీనమయ్యాము. అసలైన టీఎంసీ (TMC) ఏది అనేది కోర్టు నిర్ణయిస్తుంది,” అని టీఎంసీ రెబల్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ అన్నారు.కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్‌తో సమావేశం అనంతరం, ఢిల్లీలోని స్పీకర్ నివాసంలో రెబల్ వర్గం తిరిగి సమావేశమైన కొద్ది గంటలకే ఈ తాజా రాజకీయ పరిణామం చోటుచేసుకుంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA)తో కలిసి పనిచేస్తామని రెబల్ తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ కాకోలి ఘోష్ దస్తీదార్ ప్రకటించారు. “AITC తరపున ఎన్నికైన మేము 20 మంది ఎంపీలం స్పీకర్‌ను కలిసి, ప్రత్యేకంగా కూర్చునేందుకు అనుమతి కోరుతూ ఒక లేఖను సమర్పించాము; మా మొత్తం బలం దృష్ట్యా ఈ 20 మంది ఎంపీలు మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ మంది ఉన్నారు. మేము ‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ’లో విలీనం అవుతున్నాము. ఇకపై మేము దేశం కోసం పనిచేస్తాము మరియు ప్రధాన మంత్రి నాయకత్వంలోని NDAతో కలిసి పనిచేస్తాము,” అని ప్రకటించారు.








