సాంకేతికత అందించే దిశగా భారత్ ఎదిగింది : ప్రధాని మోదీ
భారత్ కేవలం ఓ వినియోగదారు దేశం మాత్రమే కాదని, ప్రపంచంలో అతిపెద్ద సమస్యల్ని పరిష్కరించడంలో కీలక పాత్ర కూడా పోషిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ఫ్రాన్స్ పర్యటనలో వున్న ప్రధాని మోదీ.. ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ తో భేటీ అయ్యారు. ఇద్దరు నేతలు కలిసి ‘‘ఇండియా ఇన్నోవేట్స్ 2026’’ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ప్రపంచంలో అతిపెద్ద సమస్యల్ని పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తోందని, దశాబ్దం క్రితం భారత్ కేవలం టెక్నాలజీని స్వీకరించే దేశంగా మాత్రమే వుండదేని, కానీ.. నేడు సాంకేతికత అందించే దేశంగా ఆవిర్భవించిందని ప్రకటించారు.
ఇక.. భారత్ వచ్చి, తమతో కలిసి పనిచేయాలని పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు. భారత్ లో రూపకల్పన చేయాలని, భారత్ ను అభివృద్ధి చేయాలని, ప్రపంచం కోసం పరిష్కారాలు సృష్టించాలని పిలుపునిచ్చారు. 21వ శతాబ్దంలో భారత్ వేగంగా పురోగతి సాధిస్తోందని, దేశంలో స్టార్టప్ విప్లవం కొనసాగుతోందన్నారు. యువత సరికొత్త ఆలోచనలతో మానవాళి ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు కనుగొనే దిశగా కృషి చేస్తోందన్నారు. ఆ ఆవిష్కరణలను ప్రపంచ వేదికపై నిలబెట్టడమే ఈ కార్యక్రమం లక్ష్యమని మోదీ చెప్పుకొచ్చారు.
‘నేటి యువ పారిశ్రామికవేత్తలు భారత భవిష్యత్తుకు ప్రతీక. వారి ఆత్మవిశ్వాసం, సృజనాత్మక శక్తి నవ భారతానికి అద్దం పడుతున్నాయి. గ్రామీణ జీవితాన్ని కృత్రిమ మేధ ద్వారా మార్చేలా అనేక స్టార్టప్‌లు పనిచేస్తున్నాయి’ అని మోదీ తెలిపారు. భారత్, ఫ్రాన్స్ సంబంధాలు వ్యూహాత్మక ప్రయోజనాలకు మాత్రమే పరిమితం కాదన్న మోదీ.. ఉమ్మడి దృక్పథం, విలువలు, ఆవిష్కరణలు, ప్రేరణలపై ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నారు.








