రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోయిన ‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ’.. బ్యాక్ గ్రౌండ్ ఇదే..
తృణమూల్ కాంగ్రెస్ లో ముసలం పుట్టడంతో దేశ రాజకీయ యవనిపై ఓ కొత్త పార్టీ పేరు మార్మోగిపోతోంది. ఈశాన్య ప్రాంతానికి చెందిన, అంతగా పెద్దగా పరిచయం లేని ఓ ప్రాంతీయ పార్టీ కీలక శక్తిగా అవతరించింది. ఇప్పటివరకు పార్లమెంటులో ఎటువంటి ప్రాతినిధ్యం లేని ‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ’ (NCP), తృణమూల్ కాంగ్రెస్ (TMC)కు చెందిన 20 మంది అసమ్మతి ఎంపీలు తమ పార్టీలో విలీనం కావాలని మరియు బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA)కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకోవడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది.
తృణమూల్ రెబెల్స్ ఆదివారం సాయంత్రం లోకసభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి, తాము నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీలో విలీనం అయ్యామని, ఎన్డీయేతో కలిసి పనిచేస్తామని తెలిపారు. దీంతో అందరి దృష్టి ఇప్పుడు నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీపై పడింది.
ఈ విలీనానికి అధికారిక గుర్తింపు లభిస్తే, ప్రస్తుతం 16 మంది ఎంపీలను కలిగి ఉన్న తెలుగుదేశం పార్టీ (TDP)ని అధిగమించి, లోక్సభలో బీజేపీ తర్వాత ఎన్డీయే (NDA)లో ఎన్సీపీ (NCP) తక్షణమే రెండవ అతిపెద్ద భాగస్వామ్య పక్షంగా అవతరిస్తుంది.
‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా’ అనేది భారత ఎన్నికల సంఘం వద్ద నమోదైనప్పటికీ, గుర్తింపు పొందని రాజకీయ పార్టీ. ఈ పార్టీ ప్రధానంగా ఈశాన్య ప్రాంతంలో కార్యకలాపాలు సాగిస్తుండగా, త్రిపురలో ఎన్నికల్లో పోటీ చేసింది. అలాగే, మేఘాలయలో కూడా ఇది తన ఉనికిని చాటుకుంది.ఇది ముఖ్యంగా త్రిపురలో గణనీయమైన బెంగాలీ మద్దతు కలిగిన ఒక ప్రాంతీయ పార్టీ. ఎన్నికల సంఘం వద్ద నమోదైనప్పటికీ, ఈ పార్టీ జాతీయ స్థాయిలో పెద్దగా గుర్తింపు పొందలేదు మరియు ఎన్నికలలో పరిమిత విజయాన్నే సాధించింది.
అయితే.. తాజా రాజకీయాల నేపథ్యంలో ఆ పార్టీలో చెప్పుకోదగ్గ ఎంపీలు, ఎమ్మెల్యేలు లేరు. కానీ.. వార్తల్లో నిలిచింది. ప్రతిపాదిత 20 మంది లోక్సభ ఎంపీల చేరికతో, పార్టీ పార్లమెంటరీ బలం రాత్రికి రాత్రే పెరిగి, అంతగా ప్రాచుర్యం లేని ప్రాంతీయ సంస్థగా ఉన్న దానిని కేంద్రంలోని అధికార కూటమిలో అత్యంత ప్రభావవంతమైన మిత్రపక్షాలలో ఒకటిగా మారుస్తుంది.
అయితే.. ఈ పార్టీకి సంబంధించిన సమాచారం కూడా అంతంత మాత్రంగానే వుంది. అసలు దీని వ్యవస్థాపకుడు, సంస్థాగత నిర్మాణం వంటి విషయాలు కూడా అందుబాటులో లేవు.NCPI రాజకీయ కార్యకలాపాలు ప్రధానంగా ఈశాన్య ప్రాంతంలో, ముఖ్యంగా త్రిపురలో కేంద్రీకృతమై ఉన్నాయి. మేఘాలయలో కూడా తమ ఉనికిని చాటుకునేందుకు ఆ పార్టీ కృషి చేసిందని నివేదికలు సూచిస్తున్నాయి.








