టీసీఎస్‌లో మనుషులతో సమానంగా ఏఐ ఏజెంట్లు
దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) భవిష్యత్తు కార్యకలాపాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కీలక పాత్ర పోషించనుంది. రాబోయే మూడేళ్ల వ్యవధిలో సంస్థలోని మొత్తం మానవ వనరుల (ఉద్యోగుల) సంఖ్యతో సమానంగా ‘ఏఐ ఏజెంట్లు’ కూడా పనిచేస్తారని టీసీఎస్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ సంచలన ప్రకటన చేశారు. కంపెనీ 31వ వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) వాటాదారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. టీసీఎస్ చరిత్రలోనే ప్రస్తుతం అత్యంత కీలకమైన, నిర్మాణాత్మక దశ కొనసాగుతోందని ఆయన అభివర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థలు టెక్నాలజీపై తమ పెట్టుబడులను భారీగా పెంచుతున్నాయని, ఇందులో ఏఐ ప్రధాన చోదక శక్తిగా మారిందని పేర్కొన్నారు.
ముఖ్యంగా ఇప్పటివరకు ఐటీ సేవలను పెద్దగా వినియోగించని సాంప్రదాయ రంగాల సంస్థలు సైతం ఏఐ విప్లవం పుణ్యమా అని టెక్నాలజీ వైపు మొగ్గు చూపుతున్నాయి. దీంతో టీసీఎస్ (TCS) వంటి అగ్రశ్రేణి కంపెనీల సహాయాన్ని ఆయా సంస్థలు కోరుతుండటంతో ఐటీ మార్కెట్ పరిధి మరింతగా విస్తరిస్తోందని చంద్రశేఖరన్ వివరించారు. ఈ క్రమంలోనే టీసీఎస్ ఏఐ ఆధారిత వార్షిక ఆదాయం రికార్డు స్థాయిలో 2.4 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 22,800 కోట్లు) చేరుకుందని, రాబోయే రోజుల్లో ఇది మరింత వేగంగా వృద్ధి చెందనుందని ఆయన వెల్లడించారు. ఇప్పటికే సంస్థలోని అన్ని విభాగాల్లో ఏఐ ఆధారిత ప్రాజెక్టులను టీసీఎస్ విజయవంతంగా అమలు చేస్తోందని ఆయన ఈ సందర్భంగా వాటాదారులకు భరోసా ఇచ్చారు.
సాంకేతిక రంగంలో ఏఐ రాకతో ఐటీ సేవల పరిశ్రమకు, ముఖ్యంగా ఉద్యోగాలకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందనే ప్రపంచవ్యాప్త ఆందోళనల పట్ల చంద్రశేఖరన్ స్పందించారు. ఏఐ సాంకేతికతను కేవలం ఉద్యోగాలను తగ్గించే ఒక సాధనంగా మాత్రమే చూడటం సరికాదని (TCS) ఆయన అభిప్రాయపడ్డారు. సాఫ్ట్వేర్ అభివృద్ధి, నిర్వహణ వంటి రొటీన్ పనుల్లో మానవ శ్రమ (మాన్యువల్ ఎఫర్ట్) అవసరాన్ని ఏఐ తగ్గించిన మాట వాస్తవమే అయినప్పటికీ.. అదే సమయంలో సరికొత్త బిజినెస్ మోడల్స్, నూతన సేవలు, కొత్త మార్కెట్లను కూడా ఈ సాంకేతికత సృష్టిస్తోందని విశ్లేషించారు.
కృత్రిమ మేధ విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలనే ఉద్దేశం టీసీఎస్‌కు (TCS) ఏమాత్రం లేదని ఛైర్మన్ తేల్చిచెప్పారు. భవిష్యత్తులో కార్యాలయాల్లో మానవ వనరులు, ఏఐ ఏజెంట్లు కలిసిమెలిసి పనిచేసే (కో-ఎగ్జిస్టెన్స్) విధానం మరింత పెరుగుతుందన్నారు. ఈ సహజీవనంలో ఉద్యోగులు మరింత సమర్థవంతంగా పనిచేస్తారని, తద్వారా ఐటీ మార్కెట్లో పాత నైపుణ్యాల స్థానంలో సరికొత్త స్కిల్స్‌కు భారీగా డిమాండ్ ఏర్పడుతుందని చంద్రశేఖరన్ విశ్లేషించారు. ఏఐ అనేది మనుషులకు ప్రత్యామ్నాయం కాదని, అది వారి సామర్థ్యాన్ని పెంచే అదనపు బలం అని ఆయన తన ప్రసంగం ద్వారా స్పష్టం చేశారు.








