మారుతీ సుజుకి బంపర్ ఆఫర్.. జూన్‌లో రూ. 2.15 లక్షల డిస్కౌంట్లు
కొత్త కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న వాహనదారులకు దేశీయ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకి (Maruti Suzuki) తీపి కబురు అందించింది. మార్కెట్లో అమ్మకాలను మరింతగా పెంచుకోవడమే లక్ష్యంగా జూన్ నెలకు సంబంధించి భారీ రాయితీలను ప్రకటించింది. సంస్థకు చెందిన ‘అరెనా’ (Arena), ‘నెక్సా’ (Nexa) షోరూమ్‌ల పరిధిలో విక్రయించే పలు ప్రముఖ మోడళ్లపై ఈ ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించింది.
‘నెక్సా’ మోడళ్లపై అత్యధికం
మారుతీ సుజుకి (Maruti Suzuki) ప్రీమియం కార్ల విభాగమైన నెక్సా పోర్ట్‌ఫోలియోలో కస్టమర్లకు భారీ ప్రయోజనాలు లభిస్తున్నాయి. ముఖ్యంగా కంపెనీకి చెందిన ప్రీమియం ఎంపీవీ మోడల్ ‘ఇన్విక్టో’ (Invicto)పై గరిష్టంగా ఆఫర్లు వర్తిస్తున్నాయి. ఈ వాహన కొనుగోలుపై నేరుగా క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, పాత వాహనాల స్క్రాపేజ్ బెనిఫిట్స్, లాయల్టీ రివార్డులు అన్నీ కలిపి వినియోగదారులు ఏకంగా రూ. 2.15 లక్షల వరకు తగ్గింపును సొంతం చేసుకోవచ్చు.
దీని తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ ఎస్యూవీ ‘గ్రాండ్ విటారా స్ట్రాంగ్ హైబ్రిడ్’ (Grand Vitara Strong Hybrid) మోడల్‌పై (Maruti Suzuki) సంస్థ రూ. 90,000 వరకు రాయితీలు అందుబాటులో ఉంచింది. వీటికి అదనంగా, ఈ ఎకో-ఫ్రెండ్లీ హైబ్రిడ్ మోడల్‌పై రోడ్ ట్యాక్స్ మినహాయింపులతో పాటు, ఐదేళ్ల పాటు ఎక్స్టెండెడ్ వారెంటీని కూడా ఆఫర్ చేస్తుండటం విశేషం. ఇక నెక్సా విభాగంలోని ఇతర కార్లైన బలెనో, ఫ్రాంక్స్, ఇగ్నిస్, లైఫ్‌స్టైల్ ఎస్యూవీ జిమ్నీ వంటి మోడళ్లపై కస్టమర్లు రూ. 15,000 నుంచి రూ. 45,000 వరకు తగ్గింపులను పొందవచ్చు.
‘అరెనా’ కార్లపైనా ఆఫర్లు..
సామాన్య, మధ్యతరగతి వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే అరెనా విభాగంలోని కార్లపైనా కంపెనీ (Maruti Suzuki) ఆకర్షణీయమైన ఆఫర్లను తీసుకువచ్చింది. ప్రముఖ ఎస్యూవీ ‘బ్రెజా’ (Brezza) కొనుగోలుపై గరిష్టంగా రూ. 55,000 వరకు ప్రయోజనాలు కల్పిస్తోంది. ఇక ఫ్యామిలీ కార్లుగా పేరొందిన వ్యాగన్ఆర్ (WagonR), ఆల్టో కె10 (Alto K10) మోడళ్లపై కస్టమర్లకు రూ. 52,500 వరకు డిస్కౌంట్లను ప్రకటించింది.
యువతను అమితంగా ఆకర్షించే హాచ్బ్యాక్ ‘స్విఫ్ట్’ (Swift) కారు ఏజీఎస్ (AGS) ఆటోమెటిక్ వేరియంట్లపై రూ. 45,000 వరకు, అలాగే మ్యాన్యువల్ పెట్రోల్, సీఎన్జీ వెర్షన్లపై రూ. 40,000 వరకు రాయితీలు కల్పిస్తోంది. వీటితో పాటు బడ్జెట్ కార్లైన ఎస్-ప్రెస్సో, సెలెరియో, వ్యాపార ప్రయోజనాలకు వాడే ఈకో వంటి మోడళ్లపై కూడా కస్టమర్లను ఆకట్టుకునేలా ఆకర్షణీయమైన తగ్గింపులను కంపెనీ (Maruti Suzuki) అమలు చేస్తోంది.








