మే నెలలో 25.31 లక్షల వాహనాలు.. ఆటోమొబైల్ రంగంలో రికార్డులు
దేశీయ ఆటోమొబైల్ రంగం అమ్మకాల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది. ఇంధన ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు వంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ భారతీయ వినియోగదారులు వాహనాల కొనుగోలుకే మొగ్గుచూపారు. ఫలితంగా మే నెలలో దేశవ్యాప్తంగా వాహనాల (Automobile) రిటైల్ అమ్మకాలు రికార్డు స్థాయిలో 9.55 శాతం వృద్ధి చెంది 25.31 లక్షల యూనిట్లకు చేరుకున్నాయి. గతేడాది మే నెలలో ఈ సంఖ్య 23.10 లక్షల యూనిట్లుగా ఉండగా.. ఈసారి అన్ని విభాగాల్లో అద్భుతమైన డిమాండ్ కనిపించిందని ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య ‘ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్’ (ఫాడా – FADA) అధికారికంగా వెల్లడించింది.
కార్ల అమ్మకాల్లో భారీ జంప్..
గత నెలలో నమోదైన మొత్తం విక్రయాలను విభాగాల వారీగా పరిశీలిస్తే.. ప్యాసింజర్ వాహనాలు, ద్విచక్ర వాహనాలు, త్రీ-వీలర్లు, ట్రాక్టర్ల విభాగాలు గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి. ప్యాసింజర్ కార్ల అమ్మకాలు ఏకంగా 23.25 శాతం మేర భారీ జంప్ చేసి 4.02 లక్షల యూనిట్లకు చేరుకోవడం (Automobile) మార్కెట్ జోరుకు అద్దం పడుతోంది. ఇక సామాన్యుల వాహనంగా భావించే ద్విచక్ర (టూ-వీలర్ల) వాహనాల అమ్మకాలు సైతం 18.45 లక్షల యూనిట్లతో సరికొత్త రికార్డును నెలకొల్పాయి. మరోవైపు దేశ ఆర్థిక కార్యకలాపాలకు సూచికగా పరిగణించే కమర్షియల్ (వాణిజ్య) వాహనాల విక్రయాలు 5.29 శాతం, ప్రయాణికులు, సరుకు రవాణాకు ఉపయోగించే త్రీ-వీలర్ల అమ్మకాలు 3.56 శాతం మేర సానుకూల వృద్ధిని సాధించినట్లు ఫాడా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
అమ్మకాల జోరుకు కారణాలివే..
మే నెలలో ఆటోమొబైల్ (Automobile) అమ్మకాలు ఈ స్థాయిలో ఊపందుకోవడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ ముమ్మరంగా సాగడం విక్రయాలకు బాగా కలిసొచ్చింది. దీనికితోడు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకోవడం, రైతులు, గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తి మెరుగుపడటం అమ్మకాల వృద్ధికి కీలక దన్నుగా నిలిచాయి. ఆటోమొబైల్ కంపెనీలు ఆకర్షణీయమైన ఫీచర్లతో, నూతన సాంకేతికతతో సరికొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకురావడం కూడా వినియోగదారులను షోరూమ్ల వైపు అడుగులు వేసేలా ప్రోత్సహించింది.
ఈవీల వైపు మళ్లుతున్న వినియోగదారులు
దేశీయ వాహన కొనుగోలుదారుల (Automobile) ఆలోచనా విధానంలో వస్తున్న స్పష్టమైన మార్పును ఈ గణాంకాలు ఎత్తిచూపుతున్నాయి. సాంప్రదాయ ఇంధన (పెట్రోల్, డీజిల్) వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలను (ఈవీ) కొనుగోలు చేసేందుకు ప్రజలు విపరీతమైన ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాల విభాగంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వాటా గతేడాది మే నెలలో 6.11 శాతంగా ఉండగా, ఈ ఏడాది అది ఏకంగా 9.25 శాతానికి ఎగబాకడం గమనార్హం. పర్యావరణ స్పృహ పెరగడం, నిర్వహణ వ్యయం తక్కువగా ఉండటం దరిమిలా.. రాబోయే రోజుల్లో దేశీయ ఆటోమొబైల్ (Automobile) రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా మరింతగా పెరగనుందని ఈ పరిణామాలు సూచిస్తున్నాయి.








