మరణం తర్వాతా వెంటాడిన తూటా!
కొడుకు చనిపోయాడు… కానీ అతడిని చంపిన బుల్లెట్ బిల్లు మాత్రం కుటుంబాన్ని వదల్లేదు..
ఒక తల్లికి తన బిడ్డను కోల్పోవడాన్ని మించిన పెద్ద విషాదం ఉండదు.అలాంటి సమయంలో ఆమెకు కావాల్సింది ఓదార్పు.
కానీ ఆమెను ఒక బాకీదారిలా చూశారు.ఆమె చేతిలో ప్రభుత్వం ఓ బిల్లు పెట్టింది .”మీ కొడుకును చంపడానికి ఉపయోగించిన బుల్లెట్ల ఖర్చు కట్టండి… అప్పుడు శవాన్ని తీసుకెళ్లండి.” అని . యుద్ధాలు మనుషులను చంపుతాయి. కొన్ని ప్రభుత్వాలు మాత్రం… చనిపోయిన వారిని మళ్లీ మళ్లీ చంపుతాయి. ప్రాణం తీసిన తూటాకు ధర నిర్ణయించడం ఒక క్రూరత్వమైతే… ఆ ధరను బాధిత కుటుంబం చేతనే వసూలు చేయడం మరింత అమానుషం.ఘోరం.
అసలేం జరిగింది?
యుద్ధానికి ముందే ఇరాన్లో తీవ్రమైన అంతర్గత నిరసనలు వెలువెత్తాయి. దేశంలో ఆర్థిక ఇబ్బందులపై ఎదురుతిరిగారు. స్వదేశీ నిరసనకారులు. ఇరాన్ వీధుల్లో ఆ రోజు వేలాది మంది ఉన్నారు. ఎవరి చేతిలోనూ ఆయుధాలు లేవు. ఎవరి కళ్లలోనూ యుద్ధం లేదు. కానీ అందరి గుండెల్లో ఒకే ప్రశ్న ఉంది. “మా జీవితాలు ఎందుకిలా మారిపోయాయి?” ఆ ప్రశ్నకు సమాధానం కోసం వాళ్లు వీధుల్లోకి వచ్చారు. ఎవరో తమ కొడుకును వెంటబెట్టుకుని వచ్చారు. ఎవరో తమ సోదరుడితో కలిసి నడిచారు. ఇంకెవరో ఇంట్లో ఎదురు చూస్తున్న తల్లికి “త్వరగా వస్తాను” అని చెప్పి బయల్దేరారు. కానీ ఆ రోజు వీధుల్లో వినిపించింది ప్రజల గొంతు కాదు… తూటాల శబ్దం. ఒక్క క్షణంలో అన్నీ మారిపోయాయి.ఉదయం వరకు కుటుంబ సభ్యుడిగా ఉన్న మనిషి…సాయంత్రానికి ఒక సంఖ్యగా మారిపోయాడు.ఇంటికి తిరిగి వస్తాడనుకున్న కొడుకు…శవాల గదిలో కనిపించాడు. ఆ వార్త విన్న తల్లి పరుగెత్తుకుంటూ వచ్చింది. “నా బిడ్డ ఎక్కడ?” అని అడిగింది. కన్నీళ్లతో, వణుకుతున్న చేతులతో, చివరిసారిగా తన కొడుకు ముఖం చూడాలని వేడుకుంది. కానీ అక్కడ ఆమెను ఎదుర్కొన్నది ఓదార్పు కాదు. ఆమె చెవుల్లో పడిన మాటలు మరణం కంటే భయంకరంగా ఉన్నాయి.“మీ కొడుకును చంపడానికి ఉపయోగించిన బుల్లెట్ల ఖర్చు కట్టండి… తర్వాత మృతదేహం తీసుకెళ్లండి..”ఒక్క క్షణం… ఆ తల్లి ఏం విని ఉంటుందో ఊహించండి. బహుశా ఆమెకు ప్రపంచమే ఆగిపోయినట్టు అనిపించి ఉండొచ్చు. తన గర్భంలో మోసిన బిడ్డ ఇప్పుడు చల్లని శవంగా పడి ఉన్నాడు. అతడిని ఇంటికి తీసుకెళ్లాలంటే… అతడి ప్రాణం తీసిన తూటాకు ధర చెల్లించాలట.
ఇవి కూడా చదవండి
“బుల్లెట్ ఫీజు”..
“మీ వారిని చంపడానికి మా సైన్యం ఉపయోగించిన బుల్లెట్ల (తుపాకీ గుండ్ల) ఖర్చును మీరే ప్రభుత్వానికి కట్టాలి. అలా డబ్బులు కడితేనే శవాన్ని మీకు అప్పగిస్తాం, లేదంటే ఇవ్వం” అని ముక్కుపిండి వసూలు చేశారు.
ఆ ఖర్చు ఎంతంటే?: ఒక్కో బుల్లెట్‌కు దాదాపు $480 నుండి $1,720 డాలర్లు (మన భారతీయ కరెన్సీలో చెప్పాలంటే సుమారు రూ. 40,000 నుండి రూ. 1,40,000 వరకు) డిమాండ్ చేశారు. ఒకవేళ ఒక వ్యక్తి శరీరంలోకి రెండు, మూడు బుల్లెట్లు దూసుకుపోతే.. ఆ అన్ని బుల్లెట్ల ఖర్చును లెక్కగట్టి మరీ వసూలు చేశారు. ఇరాన్లో ఒక సాధారణ కార్మికుడి నెల జీతం $100 (దాదాపు రూ. 8,000) కూడా ఉండదు. అలాంటి పరిస్థితుల్లో, కన్నబిడ్డలను కోల్పోయిన దుఃఖంలో ఉన్న పేద కుటుంబాలపై, వారిని చంపిన బుల్లెట్ల ఖర్చును కూడా కట్టమనడం అనేది అత్యంత దారుణమైన, అమానవీయ చర్య. ప్రపంచ చరిత్రలోనే ఇదొక అత్యంత క్రూరమైన నిజం.
ఇరు దేశాల మధ్య మారణకాండ: నలిగిపోయిన సామాన్య జనం
ఈ యుద్ధంలో కేవలం ఇరాన్ పాలకుల క్రూరత్వమే కాదు, అంతర్జాతీయంగా శాంతిని కాపాడతామని చెప్పే అమెరికా, ఇజ్రాయెల్ కూటమి చేసిన దాడులు కూడా సామాన్యుల పాలిట శాపంగా మారాయి.
అమెరికా-ఇజ్రాయెల్ కూటమి దారుణాలు..
‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ పేరుతో అమెరికా కూటమి ఇరాన్‌పై జరిపిన మెరుపు దాడుల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ భీకర దాడుల వల్ల ఇరాన్ వ్యాప్తంగా ఉన్న సాధారణ పౌరులు (సుమారు 1,700 నుండి 3,600 మందికి పైగా) నిద్రలోనే ప్రాణాలు వదిలారు. ఇందులో కనీసం 254 మంది పసిపిల్లలు ఉండటం పాలకుల అంధత్వానికి నిదర్శనం.
ఇరాన్ ఎదురుదాడులు – గల్ఫ్ దేశాల కష్టాలు..
ఇటు అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ వందలాది డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడుల వల్ల ఇటు ఇజ్రాయెల్ పౌరులతో పాటు, యుద్ధంతో ఏమాత్రం సంబంధం లేని యూఏఈ, కువైట్, బహ్రెయిన్, సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాల్లోని సామాన్య ప్రజలు, వలస కార్మికులు (సుమారు 40-48 మంది) ప్రాణాలు కోల్పోయారు. కువైట్ ఎయిర్‌పోర్ట్‌పై జరిగిన దాడిలో ఒక అమాయక భారతీయుడు కూడా బలయ్యాడు.
లెబనాన్‌లో విలయం..
ఈ యుద్ధం కాస్తా లెబనాన్‌కు పాకడంతో అక్కడ మరింత భీభత్సం జరిగింది. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఏకంగా 3,800 మందికి పైగా లెబనాన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో వందకు పైగా వైద్య సిబ్బంది కూడా ఉన్నారు. దాదాపు 12 లక్షల మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి రోడ్డున పడ్డారు. ఇదంతా చూసాక ఏ తల్లి గుండె అయినా పగిలిపోదా? ఏ తండ్రి ఆవేదనతో కుప్పకూలిపోడా? ఇది కేవలం ఒక కుటుంబం కథ కాదు.వేల కుటుంబాల వ్యథ. వేల గుండెల బాధ.వేల కన్నీటి చరిత్ర. అమెరికా దాడుల్లో చనిపోయిన వారైనా… ఇరాన్ అణచివేతలో ప్రాణాలు కోల్పోయిన వారైనా…చనిపోయే ముందు వాళ్లు రాజకీయ నాయకులు కాదు.వాళ్లు సైనిక వ్యూహాలు కాదు.వాళ్లు గణాంకాలు కాదు. ఎవరికో కొడుకులు.ఎవరికో భర్తలు. ఎవరికో తండ్రులు. ఎవరికో ప్రపంచం. కానీ యుద్ధాలకు మనుషులు సంఖ్యలుగా కనిపిస్తారు. నివేదికల్లో అంకెలుగా కనిపిస్తారు. ప్రెస్ మీట్లలో గణాంకాలుగా కనిపిస్తారు.
కానీ ఇంట్లో…
వాళ్లు ఖాళీ కుర్చీలుగా కనిపిస్తారు. గోడపై వేలాడే ఫోటోలుగా కనిపిస్తారు. తిరిగి రాని జ్ఞాపకాలుగా మిగిలిపోతారు. అందుకే యుద్ధాల అసలు విషాదం మరణాల్లో లేదు. మరణించిన వారి సంఖ్యల్లో లేదు. తమ కొడుకు శవాన్ని తీసుకెళ్లడానికి కూడా చేతులు చాచి డబ్బు అడగాల్సిన తల్లి కన్నీళ్లలో ఉంది.తన తండ్రి ఎందుకు రాలేదో అర్థం కాని చిన్నారి ప్రశ్నలో ఉంది. మళ్లీ ఎప్పటికీ తెరుచుకోని ఒక ఇంటి తలుపులో ఉంది. మరణం ఒక మనిషిని తీసుకెళ్తుంది. కానీ ఇలాంటి క్రూరత్వం… ఒక కుటుంబం నుంచి మిగిలిన నవ్వును కూడా తీసుకెళ్తుంది. అందుకే కొన్ని కథలు యుద్ధాల గురించి కావు…మానవత్వం ఎలా ఓడిపోయిందో చెప్పే కథలు.
ఇవి కూడా చదవండి
ఇవి కూడా చదవండి
By Josyula Surya Prakash








