తమిళనాడులో కొత్త పొత్తు? సీఎం విజయ్ తో జట్టు కట్టనున్న వైకో?
తమిళనాడులో మళ్లీ కొత్త పొత్తు తెరపైకి రానుందా? డీఎంకేకు చిరకాల మిత్రపక్షమైన మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కళగం(ఎండీఎంకే) అధికార తమిళగ వెట్రి కళగం(టీవీకే)తో జట్టుకట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఎండీఎంకే అధినేత వైకో, సీఎం విజయ్ తో భేటీ అయ్యారు. ఇటీవలే వైకో కుమారుడు, ఎండీఎంకే ఎంపీ దురై వైకో కూడా విజయ్‌తో సమావేశమైన సంగతి తెలిసిందే.దీంతో పొత్తు వుంటుందా? అన్న అంశం తెరపైకి వచ్చింది.
2026 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని కూటమిలో ఎండీఎంకే పోటీచేసి రెండు స్థానాలను కైవసం చేసుకుంది. ఆ పార్టీ సాధారణ మండలి సమావేశం ఈ నెలాఖరులో జరగనుంది. పార్టీ భవిష్యత్తు రాజకీయ దిశగా ఆ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అయితే.. టీవీకే నేతృత్వంలోని మైనారిటీ ప్రభుత్వంపై జరిగిన విశ్వాస పరీక్షలో ఎండీఎంకే తటస్థంగా వ్యవహరించింది.








