శివసేనలో తిరుగుబాట్లు, చీలికలు… చరిత్ర ఇదీ.. 2026లోనూ పునరావృత్తమేనా?
శివసేన స్థాపించి 60 సంవత్సరాలు నిండబోతోంది. సరిగ్గా 60 వ వ్యవస్థాపక దినోత్సవం దగ్గరపడుతున్న వేళ పార్టీ చీలిక అనే ముప్పును తీవ్రంగా ఎదుర్కొంటోంది. తన వర్గ ప్రజా ప్రతినిధులను పదిలంగా వుంచుకోవడానికి ఉద్ధవ్ నానా కష్టాలూ పడుతున్నారు. 1966లో బాల్ థాకరే దీనిని స్థాపించినప్పటి నుండి, శివసేన తన దూకుడు హిందుత్వ, ప్రాంతీయ గుర్తింపు రాజకీయాలకు ప్రసిద్ధి చెందింది. కానీ అంతర్గత కలహాలు, అగ్ర నాయకుల నిష్క్రమణ పార్టీకి సవాల్ గా మారాయి.
1991 నుండి 2022 వరకు, శివసేన ప్రతి దశాబ్దంలోనూ భారీ ఎదురుదెబ్బలను ఎదుర్కొంది.
1991 ఛగన్ భుజ్ బల్ సారథ్యంలో తిరుగుబాటు…
1991 ఛగన్ భుజ్ బల్ సారథ్యంలో శివసేన అతిపెద్ద తిరుగుబాటును ఎదుర్కొంది. యన 17 మంది ఎమ్మెల్యేలతో కలిసి పార్టీని వీడి, శరద్ పవార్ వర్గంలో చేరారు. తర్వాతి కాలంలో, కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వాలలో ఉప ముఖ్యమంత్రి మరియు హోం మంత్రి వంటి కీలక పదవులను ఆయన చేపట్టారు.ఆయన నిష్క్రమణ తర్వాత సంస్థాగతంగా పార్టీకి సవాల్ గా నిలిచింది.
1999 లో గణేష్ నాయక్…
గణేష్ నాయక్
నవీ ముంబైలో బలమైన పట్టు కలిగిన గణేష్ నాయక్, వ్యక్తిగత ఆశయాల కారణంగా శివసేనను వీడి ఎన్సీపీలో చేరారు. ఎన్సీపీలో దాదాపు రెండు దశాబ్దాల పాటు కొనసాగిన తర్వాత, 2019లో ఆయన బీజేపీలో చేరారు; ఇప్పటికీ నవీ ముంబై రాజకీయాల్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
2004: నారాయణ్ రాణే…
ఉద్ధవ్ థాకరేతో విభేదాల కారణంగా మాజీ ముఖ్యమంత్రి నారాయణ్ రాణే శివసేనను వీడారు. కాంగ్రెస్ మరియు తన సొంత పార్టీ అయిన ‘స్వాభిమాన్ పార్టీ’లో కొంతకాలం కొనసాగిన తర్వాత, చివరకు ఆయన బీజేపీలో చేరారు. ప్రస్తుతం కొంకణ్ ప్రాంతంలో బీజేపీకి ఆయన ఒక బలమైన నాయకుడిగా ఉన్నారు.
2007 రాజ్ థాకరే…
ఇది నష్టం నేరుగా థాకరే కుటుంబానికే తగిలింది.బాల్ థాకరే క్రియాశీల రాజకీయాల నుండి తప్పుకుని, శివసేనను తన కుమారుడు ఉద్ధవ్ థాకరేకు అప్పగించడంతో, మేనల్లుడు రాజ్ థాకరే తిరుగుబాటు చేశారు. కుటుంబంలోని అంతర్గత విభేదాలు, ఉద్ధవ్ థాకరే పెరుగుతున్న ప్రాబల్యం పట్ల అసంతృప్తితో, రాజ్ థాకరే శివసేనను వీడి మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS)ను స్థాపించారు.ఆరంభంలో ఎన్నికలలో విజయం సాధించినప్పటికీ, పార్టీ తన రాజకీయ పట్టును నిలబెట్టుకోవడంలో విఫలమై, ప్రస్తుతం ఎన్నికల పరంగా నామమాత్రపు పార్టీగా మిగిలిపోయింది. రాజ్ నిష్క్రమణను శివసేన కీలక బలాన్ని చీల్చిన సైద్ధాంతిక మరియు కుటుంబ విభేదంగా పరిగణించారు.
2022: ఏక్నాథ్ షిండే….
ఏకనాథ్ షిండే కేవలం తిరుగుబాటే చేయలేదు. ఏకంగా పార్టీని చీల్చేశారు. శివసేనను రెండుగా చీల్చేశారు.2022లో ఏక్నాథ్ షిండే పార్టీని అధికారికంగా విభజించారు. అత్యధిక సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎంపీలు షిండేతో కలిసి బయటకు వచ్చారు. గతంలో జరిగిన ఇలాంటి పరిణామాలన్నింటితో పోలిస్తే, షిండే తిరుగుబాటు ప్రభావం చాలా లోతైనదిగా ఉంది.ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనను న్యాయపరమైన మరియు సంస్థాగత సంక్షోభంలోకి నెట్టివేసింది.తిరుగుబాటు ఉధృతంగా ఉన్న సమయంలో, షిండేతో పాటు 40 నుండి 46 మంది ఎమ్మెల్యేలు గౌహతిలో బస చేశారు. షిండే వర్గం బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా, అధికారిక శివసేనగా గుర్తింపు పొంది, పార్టీ పేరు మరియు ‘విల్లు-బాణం’ ఎన్నికల గుర్తును దక్కించుకుంది.
2026 లో……..??
ఉద్ధవ్ థాకరేను వీడి ఏక్నాథ్ షిండే వైపు ఎంపీలు వెళ్లడం ద్వారా 2022 నాటి పరిస్థితులు పునరావృతమవుతాయా? లేక ఆ సంక్షోభాన్ని ఉద్ధవ్ థాకరే అడ్డుకోగలరా? వేచి చూడండి.








