ట్రాఫిక్ కష్టాలకు చెక్.. HMDA సరికొత్త కారిడార్ ప్లాన్
HMDA: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) కీలకమైన ప్రణాళికలను సిద్ధం చేసింది. నగరంలో వ్యక్తిగత వాహనాల సంఖ్య 80 లక్షలు దాటడంతో, ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (UMTA) ద్వారా కూకట్పల్లి వై జంక్షన్ నుంచి గండిమైసమ్మ, ఎల్బీనగర్ నుంచి నాగోల్ వంటి ముఖ్యమైన ప్రాంతాలలో రహదారులను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు.
భూముల విలువలు పెరగడం..
ఈ ప్రణాళికలో భాగంగా రహదారుల విస్తరణతో పాటు ఆక్రమణల తొలగింపు, డ్రైనేజీ వ్యవస్థను బలోపేతం చేయడం , విద్యుత్, గ్యాస్ పైపులైన్ల కోసం భూగర్భంలో ప్రత్యేక మార్గాలు చేపట్టనున్నారు. దీనివల్ల రోడ్లను పదేపదే తవ్వాల్సిన అవసరం ఉండదు. అలాగే పాదచారులకు, దివ్యాంగులకు అనుకూలమైన ఫుట్‌పాత్‌లు, ర్యాంపులు, ఆధునిక బస్ షెల్టర్ల నిర్మాణం , సిగ్నల్ రహిత ప్రయాణం కోసం ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లను కూడా నిర్మించనున్నారు. ఈ పనులు పూర్తి చేయడం ద్వారా నగరంలో ట్రాఫిక్ వేగం ప్రస్తుతమున్న గంటకు 15 కిలోమీటర్ల నుండి 30-40 కిలోమీటర్లకు పెరగడమే కాకుండా, ప్రమాదాలు తగ్గడం , భూముల విలువలు పెరగడం వంటి ప్రయోజనాలు కలుగుతాయని అంచనా. అయితే, భూసేకరణ , పనుల సమయంలో ఎదురయ్యే ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించేందుకు సరైన ప్రణాళిక అవసరమని పేర్కొన్నారు.








