దీనికి తెలంగాణ సీఎం అంగీకరించలేదు : అందువల్లే మెట్రో ఆలస్యం : కిషన్ రెడ్డి
హైదరాబాద్ మెట్రో రైలు (Metro Rail) మొదటి దశ స్వాధీనం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ) నుంచి రుణం రాకుండా తాను అడ్డుకున్నానని ముఖ్యమంత్రి రేవంత్ ఆరోపించడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సీఎం స్థాయి వ్యక్తికి తగదని అన్నారు. రేవంత్ ఆరోపణల నేపథ్యంలో ఈ విషయమై తాను కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఖట్టర్ (Minister Khattar)తో ఫోన్లో మాట్లాడగా, మెట్రో మొదటి దశ స్వాధీనం, రెండో దశ ప్రాజెక్టుకు సంబంధించి ఆర్థిక, సాంకేతిక అంశాల్లో తెలంగాణ ఇచ్చిన ప్రతిపాదనల వల్లే కొంత ఆలస్యం జరుగుతోందని చెప్పినట్లు వెల్లడించారు.
ఐఆర్ఎఫ్సీతో రాష్ట్ర ప్రభుత్వానికి కుదిరిన ఒప్పందం ప్రకరాం మెట్రో ద్వారా వచ్చే ఆదాయాన్ని అప్పు తీర్చేందుకే వినియోగించాల్సి ఉందని తెలిపారు. అయితే, ముందుగా మెట్రో నిర్వహణ, కార్యాకలపాల కోసం ఖర్చు పెట్టాలని, మిగిలిన ఆదాయాన్ని ఫేజ్ 2, ఐఆర్ఎఫ్సీ (IRFC) రుణాల కోసం చెల్లించాలని ఖట్టర్ ప్రతిపాదించగా, సీఎం రేవంత్ అంగీకరించలేదని తెలిపారు. ఇది చిన్న సమస్య అని, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ చర్చల ద్వారా తేల్చుకోవాల్సిన అంశమని చెప్పారు. మెట్రో అంశంపై ఖట్టర్‌తో సమావేశానికి రేవంత్ ఎప్పుడొచ్చినా తాను కూడా వస్తానని, తనకు ఎలాంటి భేషజాల్లేవని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. మెట్రో స్వాధీనానికి రుణం ఇవ్వవద్దని తాను అన్నట్లు ఏ మంత్రి చెప్పారో రేవంత్ చెప్పగలరా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునే ఆలోచన తనకు లేదని, అటువంటి ఉద్దేశాలు కాంగ్రెస్‌కే ఉంటాయని ఎద్దేవా చేశారు.








