అవినీతి నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా.. నిరూపించకపోతే ఆయన రాజకీయాల నుంచి వైదొలగుతారా?
గురుకుల విద్యాసంస్థల కొనుగోళ్ల టెండర్లలో అవినీతి జరిగిందంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao), ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ( RS Praveen Kumar) చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, వాటిని ఆధారాలతో నిరూపిస్తే, మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ (Adluri Lakshman Kumar) సవాల్ విసిరారు. సీఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గురుకులాల టెండర్ల అంశంపై బీఆర్ఎస్ నేతలు హరీశ్‌రావు రూ.2వేల కోట్ల కుంభకోణమని, ప్రవీణ్‌కుమార్ రూ.3వేల కోట్లని, వారి మీడియా రూ.200 కోట్లంటూ ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. నోటికి వచ్చినట్లు మాట్లాడటం సరికాదని, దమ్ముంటే ఒక్క ఫైల్ లేదా ఒక్క చెల్లింపు వివరాన్ని ఆధారంగా చూపించాలని డిమాండ్ చేశారు. టెండర్ల ప్రక్రియ అంతా సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy), ముగ్గురు మంత్రులు, సీనియర్ ఐఏఎస్ అధికారుల సమక్షంలో పారదర్శకంగా ఈ-ప్రొక్యూర్మెంట్ పోర్టల్ ద్వారా జరిగిందని మంత్రి స్పష్టం చేశారు. కేంద్రీకృత కొనుగోలు విధానాన్ని హైకోర్టు సమర్థించిందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యాసంస్థలు ప్రారంభమైన తర్వాత సెప్టెంబర్, అక్టోబర్లలో పుస్తకాలు, యూనిఫాంలు అందేవని మంత్రి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సకాలంలో వస్తువులు అందిస్తుంటే, ఓర్వలేక బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు.








