ది ప్యారడైజ్ ప్రమోషన్స్ కోసం స్పెషల్ బడ్జెట్
నేచురల్ స్టార్ నాని(Nani) గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు మార్కెట్‌కే పరిమితం కాకుండా పాన్ ఇండియా స్థాయిలో తన గుర్తింపును విస్తరించుకునేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. ప్రతి సినిమా రిలీజ్‌కు ముందు దాదాపు నెల రోజుల పాటు వివిధ భాషల్లో ఇంటర్వ్యూలు, ప్రమోషనల్ ఈవెంట్లు నిర్వహిస్తూ ఇతర భాషల ఆడియన్స్ ను చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా దసరా(Dasara) సినిమాతో పాన్ ఇండియా మార్కెట్లో బలమైన ముద్ర వేయాలని నాని భావించినప్పటికీ, ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. ఆ తర్వాత వచ్చిన హాయ్ నాన్న(Hi Nanna), హిట్3(Hit3) సినిమాలకు కూడా తెలుగు రాష్ట్రాలు కాకుండా ఇతర భాషల్లో కూడా విస్తృత ప్రమోషన్స్ చేసినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన రెస్పాన్స్ కనిపించలేదు.
అయితే ఇప్పుడు తన కెరీర్లో అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌గా భావిస్తున్న ది ప్యారడైజ్(The Paradise) విషయంలో నాని మరింత దూకుడుగా వ్యవహరించేందుకు సిద్ధమవుతున్నారు. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. సౌత్ ఆడియన్స్ తో పాటూ నార్త్ మార్కెట్ ను కూడా ఆకట్టుకునే కంటెంట్ ఈ సినిమాలో ఉందనే నమ్మకంతో నాని ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ సినిమా కోసం ప్రత్యేక పాన్ ఇండియా ప్రమోషనల్ ప్లాన్ రూపొందించగా, రిలీజ్‌కు ముందే అన్ని ప్రధాన నగరాల్లో భారీ స్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
ఇక నిర్మాత సుధాకర్ చెరుకూరి(Sudhakar Cherukuri) కూడా ప్రమోషన్స్ కోసం భారీ బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. ముఖ్యంగా హిందీ మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తూ రికార్డు స్థాయి విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో మంచి బజ్ సొంతం చేసుకున్న ఈ సినిమా, ఇతర భాషల్లో కూడా అదే స్థాయి క్రేజ్‌ను సంపాదించాల్సిన అవసరం ఉంది. అందుకోసం ట్రైలర్, పాటలు దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తుండగా, అనిరుధ్(Anirudh Ravichander) సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆగస్టు విడుదలను మిస్ చేసుకునే అవకాశం ఉంది. కొత్త రిలీజ్ డేట్ ను మేకర్స్ త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.








