షాకింగ్: ఒక యూట్యూబ్ ఛానల్… ₹340 కోట్ల సినిమా! సినిమా బిజినెస్ రూల్స్ మార్చేసిన ‘ఐరన్ లంగ్’
— టాలీవుడ్ కూడా ఇదే దారిలో నడవనుందా?
—సూర్య ప్రకాష్ జోశ్యుల
ఒకప్పుడు సినిమా తీయాలనే కల ఉంటే ముందుగా స్టూడియో గుమ్మం తట్టాలి. నిర్మాతను ఒప్పించాలి. డిస్ట్రిబ్యూటర్ను నమ్మించాలి. థియేటర్ దొరికితేనే ప్రేక్షకుల ముందుకు వెళ్లాలి. సినిమా ప్రపంచంలోకి ప్రవేశించడానికి వీళ్లంతా గేట్కీపర్లు ఉండేవారు. కానీ డిజిటల్ యుగం ఆ గేట్లన్నింటినీ ఒక్కొక్కటిగా కూల్చేస్తోంది.
అమెరికాలో తాజాగా సంచలనం సృష్టించిన Iron Lung సినిమా అందుకు తాజా ఉదాహరణ. ఇది కేవలం ఒక హారర్ సినిమా విజయం కాదు. ఇది సినిమా వ్యాపారం ఎలా మారుతోందో చెప్పే ఒక కేస్ స్టడీ. హాలీవుడ్ ఇప్పటి వరకు నమ్మిన సూత్రాలకు ఇది విసిరిన సవాల్. అదే సమయంలో కొత్తగా సినిమాలు తీయాలనుకునే వారికి ఇది ఒక గొప్ప ప్రేరణ కూడా.
అసలేం జరిగింది?
యూట్యూబ్‌లో 3.85 కోట్లకు పైగా సబ్స్క్రైబర్లు కలిగిన మార్కిప్లియర్ అనే క్రియేటర్ Iron Lung సినిమాను రూపొందించాడు. సుమారు 4 మిలియన్ డాలర్ల (దాదాపు ₹34 కోట్లు) బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన కొద్ది రోజులకే 40 మిలియన్ డాలర్లకు పైగా (దాదాపు ₹340 కోట్లు) వసూలు చేసింది. అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ విజయానికి వెనుక పెద్ద స్టూడియో లేదు. వందల కోట్ల మార్కెటింగ్ బడ్జెట్ లేదు. సాంప్రదాయ హాలీవుడ్ వ్యవస్థ మద్దతు కూడా లేదు.
స్టార్ మార్కెట్ కంటే… కమ్యూనిటీ మార్కెట్ పెద్దదా?
సినిమా వ్యాపారంలో ఇప్పటి వరకు “స్టార్ పవర్” అనే మాట ఎక్కువగా వినిపించేది. ఒక హీరోకి ఎంత మార్కెట్ ఉంది? మొదటి రోజు ఎంత ఓపెనింగ్ వస్తుంది? ఏ ప్రాంతంలో ఎంత బిజినెస్ జరుగుతుంది? అన్నదే ప్రధాన చర్చగా ఉండేది.
కానీ Iron Lung విజయం మరో విషయం చెబుతోంది. ఇప్పుడు ప్రేక్షకులతో నిర్మించుకున్న సంబంధం కూడా ఒక మార్కెట్. సంవత్సరాల పాటు వీడియోలు చేస్తూ, తన జీవితాన్ని పంచుకుంటూ, ప్రేక్షకులతో ఒక కుటుంబంలా మెలిగిన మార్కిప్లియర్కు అభిమానులు మాత్రమే లేరు. అతనికి ఒక కమ్యూనిటీ ఉంది. ఆ కమ్యూనిటీ అతని సినిమా కోసం టికెట్లు కొంది. సోషల్ మీడియాలో ప్రచారం చేసింది. థియేటర్లలో షోలు పెంచేలా ఒత్తిడి చేసింది. ఒక విధంగా చెప్పాలంటే, అతని యూట్యూబ్ ప్రేక్షకులే ఈ సినిమాకు మార్కెటింగ్ టీమ్‌గా మారిపోయారు. అదే ఈ విజయానికి అసలు కారణం.
ఏముంది సినిమాలో!
Iron Lung అనేది కేవలం ఒక హారర్ సినిమా కాదు. ఇది భయం, ఒంటరితనం, తెలియని ప్రమాదాల చుట్టూ తిరిగే ఒక సై-ఫై సర్వైవల్ థ్రిల్లర్.దేవిడ్ సిమాన్స్కి అనే గేమ్ డెవలపర్ రూపొందించిన పాపులర్ వీడియో గేమ్ ఆధారంగా, మార్క్ ఈ సినిమాను విజువల్ వండర్‌గా మార్చాడు. ఒక సబ్‌మెరైన్ చుట్టూ, రక్తపు సముద్రంలో సాగే ఊపిరిసల్పని భయానక ప్రయాణమే ఈ సినిమా. ఈ మూవీ కోసం ఏకంగా 80 వేల గ్యాలన్ల నకిలీ రక్తాన్ని వాడారంటే, సీన్లు ఏ రేంజ్లో పండాయో అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఫ్రేమ్‌లోనూ కొత్తదనం, ప్రతి సీన్ లోనూ సస్పెన్స్ నింపుతూ విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.
ఇవి కూడా చదవండి
హాలీవుడ్‌ను ఆలోచింపజేస్తున్న కొత్త లెక్క
ఒక సినిమా కోసం స్టూడియోలు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రేక్షకులను వెతుకుతుంటే, యూట్యూబ్ క్రియేటర్ల దగ్గర ప్రేక్షకులు ముందే సిద్ధంగా ఉన్నారు. ఇదే ఇప్పుడు హాలీవుడ్‌ను ఆలోచింపజేస్తున్న అంశం. ఒక క్రియేటర్‌కు 3 కోట్ల మంది ఫాలోవర్స్ ఉంటే, అందులో కేవలం 5 శాతం మంది మాత్రమే థియేటర్‌కు వెళ్లినా అది భారీ ఓపెనింగ్ అవుతుంది. ఇలాంటి లెక్కలు చూసిన తర్వాత స్టూడియోలు కూడా సోషల్ మీడియా క్రియేటర్లను కొత్త కోణంలో చూడటం మొదలుపెట్టాయి. ఎందుకంటే వాళ్లు కేవలం కంటెంట్ క్రియేటర్లు కాదు, తమతో పాటు ప్రేక్షకులను తీసుకెళ్లగలిగే బ్రాండ్లు.
కొత్త దర్శకులకు ఇది ఒక పాఠం
ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం డబ్బు కాదు. ప్రయాణం. మార్కిప్లియర్ ఒకప్పుడు కాలేజీ విద్యార్థి. సాధారణ గదిలో కూర్చొని వీడియోలు చేసిన వ్యక్తి. అతను మొదట ప్రేక్షకులను నిర్మించుకున్నాడు. తర్వాత సినిమాను నిర్మించాడు. ఇన్నాళ్లుగా అందరు దర్శకులూ ముందుగా సినిమా తీసి తర్వాత ప్రేక్షకులను వెతుకుతారు. కానీ డిజిటల్ యుగం కొత్త సూత్రం చెబుతోంది. ముందుగా ప్రేక్షకులతో బంధం నిర్మించాలి. తర్వాత వాళ్ల కోసం కథ చెప్పాలి. ఈ సూత్రం అర్థమైతే, భవిష్యత్తులో మరెందరో కొత్త ఫిల్మ్మేకర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
బెడ్ రూమ్ క్రియేటర్స్.. ఇక బాక్సాఫీస్ రూలర్స్!
ఒకప్పుడు కెమెరా ముందు కథలు చెప్పినోళ్లే, ఇప్పుడు థియేటర్ల దగ్గర కాసులు కురిపిస్తున్నారు. మార్క్ సృష్టించిన ఈ ఇంపాక్ట్‌తో రాబోయే రోజుల్లో యూట్యూబ్ నుంచి మరింత మంది క్రియేటర్స్ వెండితెరపైకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. పెద్ద పెద్ద స్టూడియోల చుట్టూ కాళ్లు అరిగేలా తిరగనక్కర్లేదు, మీ దగ్గర కంటెంట్ ఉంటే చాలు.. మీ సబ్స్క్రైబర్లే మీ ఇన్వెస్టర్లు, మీ ఫాలోవర్లే మీ ప్రొడ్యూసర్లు అని ఈ సినిమా ప్రూవ్ చేసింది. కేన్ పార్సన్స్ తీసిన ‘బ్యాక్‌రూమ్స్’, కర్రీ బార్కర్ తీసిన ‘అబ్సెషన్’ సినిమాలు కూడా ఇదే బాటలో వందల కోట్లు వసూలు చేయడం విశేషం. ఇకపై ఓన్ ఆడియన్స్ ఉన్న క్రియేటరే.. బాక్సాఫీస్ కింగ్స్!
భారతీయ సినీ పరిశ్రమపై దీని ప్రభావం ఎలా ఉంటుంది?
ఈ మార్పు మొదట అమెరికాలో కనిపించినా, దాని ప్రభావం భారత్‌లో మరింత పెద్ద స్థాయిలో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యధిక డిజిటల్ ప్రేక్షకులు ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. మన దేశంలో లక్షల నుంచి కోట్ల మంది ఫాలోవర్స్ కలిగిన యూట్యూబర్లు, సోషల్ మీడియా క్రియేటర్లు ఇప్పటికే ఉన్నారు. ఇప్పటివరకు వారు వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌ల వరకే పరిమితమయ్యారు. కానీ Iron Lung లాంటి విజయాలు వారికి కొత్త ధైర్యాన్ని ఇస్తాయి.
ఇకపై తెలుగు, తమిళ, హిందీ, మలయాళ పరిశ్రమల్లో కూడా క్రియేటర్లు సినిమాలు తీయడం సాధారణంగా మారవచ్చు. నిర్మాతల దగ్గరకు వెళ్లి అవకాశాలు అడిగే బదులు, తమ కమ్యూనిటీని నమ్ముకుని సినిమాలు నిర్మించే వాళ్లు పెరగవచ్చు. ముఖ్యంగా చిన్న, మధ్యస్థాయి బడ్జెట్ సినిమాల్లో ఇది పెద్ద మార్పుకు దారితీయవచ్చు.
క్రియేటివ్ టాలెంట్, సోషల్ మీడియా అండ కలిస్తేనే?
ఈ గ్లోబల్ ట్రెండ్ మన భారతీయ సినీ పరిశ్రమపై కూడా గట్టి ప్రభావం చూపించబోతోంది. మన దగ్గర కూడా డిజిటల్ క్రియేటర్స్, యూట్యూబర్లకు మిలియన్లలో ఫ్యాన్ బేస్ ఉంది. రేపు పొద్దున మన లోకల్ క్రియేటర్స్ కూడా పెద్ద స్టార్ల డేట్ల కోసం ఆగకుండా, స్టూడియోల చప్పట్లు నమ్మకుండా.. సొంతంగా సినిమాలను ప్రొడ్యూస్ చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. మన క్రియేటివ్ టాలెంట్‌కు, సోషల్ మీడియా అండ తోడైతే ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కూడా ఇలాంటి ఇండీ వండర్స్ ఎన్నో చూస్తాం. బడ్జెట్ చిన్నదైనా సరే, ఐడియా పెద్దదైతే థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!
టాలీవుడ్లో కూడా ఇదే ట్రెండ్ వస్తుందా?
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా పెరిగింది. ఒక సినిమా ట్రైలర్ హిట్ అవ్వడం కంటే, ఒక కంటెంట్ క్రియేటర్ దాని గురించి మాట్లాడితే ఎక్కువ మంది తెలుసుకునే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో రాబోయే ఐదేళ్లలో టాలీవుడ్లో కూడా “స్టార్ ఎవరు?” అనే ప్రశ్నతో పాటు “అతని కమ్యూనిటీ ఎంత పెద్దది?” అనే ప్రశ్న వినిపించే అవకాశం ఉంది.
అది జరిగితే సినిమా వ్యాపారంలో కొత్త సమీకరణాలు కనిపిస్తాయి. హీరోలతో పాటు క్రియేటర్లు కూడా బాక్సాఫీస్‌ను ప్రభావితం చేసే స్థాయికి చేరుకోవచ్చు.
ఇది మొదటిదేనా… లేక కొత్త యుగానికి ప్రారంభమా?
Iron Lung విజయం ఒక విషయం స్పష్టంగా చెబుతోంది. ప్రేక్షకుల నమ్మకం, డిజిటల్ కమ్యూనిటీ, మంచి కథ కలిస్తే స్టూడియోలు లేకుండానే అద్భుతాలు చేయొచ్చు. ఇన్నాళ్లూ యూట్యూబ్‌ను చిన్నచూపు చూసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు యూట్యూబ్ నుంచి వచ్చిన క్రియేటర్లు సినీ పరిశ్రమకు కొత్త పాఠాలు చెబుతున్నారు.
రేపటి రోజుల్లో మరింత మంది యూట్యూబర్లు సినిమాలు తీస్తారు. మరింత మంది యువ దర్శకులు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల నుంచే ఎదుగుతారు. మరింత మంది ప్రేక్షకులు తమకు నచ్చిన క్రియేటర్లను థియేటర్లలో చూడటానికి సిద్ధమవుతారు.
అందుకే Iron Lung కథను కేవలం ఒక సినిమా విజయంగా చూడకూడదు. ఇది సినిమా పరిశ్రమలో మొదలైన కొత్త అధ్యాయం. ఆ అధ్యాయంలో హీరోలు స్టూడియోలు కాదు. ప్రేక్షకుల నమ్మకాన్ని గెలుచుకున్న క్రియేటర్లే.








