మురసోళీ’’ సంపాదకీయంలో రాహుల్ పై విరుచుకుపడ్డ డీఎంకే..
కాంగ్రెస్ – డీఎంకే ఒకప్పుడు మంచి రాజకీయ మిత్రులు. చాలా సంవత్సరాల పాటు ఈ బంధం కొనసాగింది. కానీ.. తాజా ఎన్నికల్లో విజయ్ పార్టీ విజయం సాధించడంతో, కాంగ్రెస్ హఠాత్తుగా డీఎంకేను విడిచి పెట్టేసి, విజయ్ తో జత కట్టింది. దీంతో డీఎంకే ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కాంగ్రెస్ తో కటీఫ్ చెప్పేసింది. అప్పటి నుంచి ఇరు పార్టీల మధ్య వైరం ముదిరింది.
తాజాగా డీఎంకే తన అధికార పత్రిక ‘‘మురసోలీ’’ కేంద్రంగా కాంగ్రెస్ పై, రాహుల్ గాంధీపై డీఎంకే విమర్శలకు దిగింది. మరీ ముఖ్యంగా రాహుల్ టార్గెట్ గా విమర్శలకు దిగింది. రాహుల్ ఓ పెద్ద జోక్ అంటూ ఎగతాళి చేసింది. ప్రతిపక్ష పార్టీల మధ్య ఐక్యతను రాహుల్ బలహీనపరుస్తున్నారంటూ విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఉనికి కోసం పోరాడుతుండగా, తాము వారిని తమ భుజాలపై మోశామని డీఎంకే పేర్కొంది. కానీ.. ఓ కొత్త బొమ్మ రాగానే మాకు హ్యాండిచ్చి వెళ్లిపోయారు.ఇటీవల జరిగిన ఇండియా కూటమి సమావేశంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, విపక్ష పార్టీల్లో చీలికలు తలెత్తడానికి ఆయనే కారకుడని ఆరోపించింది. విపక్షాల ఐక్యత గురించి ఉపన్యాసాలు ఇస్తూ పలు రాష్ట్రాల్లో విపక్షాల ఐక్యతను బలహీనపరుస్తున్నది ఎవరని రాహుల్‌ను నిలదీసింది. కేరళలో వామపక్షాలు సైతం రాహుల్‌పై ఇటీవల చేసిన విమర్శలను ప్రస్తావించింది. ఎన్నికల ప్రచారంలో పినరయి విజయన్ను అరెస్టు చేయాలని రాహుల్ డిమాండ్ చేయడం, బీజేపీతో ఎల్డీఎఫ్ రహస్య అవగాహన కుదుర్చుకుందని ఆరోపించడంపై కమ్యూనిస్టు నేతలు నిలదీయడాన్ని ‘మురసోలి’ పత్రిక తమ సంపాదకీయంలో గుర్తుచేసింది.
ప్రత్యర్థి బీజేపీకి బదులుగా సొంత భాగస్వామ్య పార్టీలను విమర్శించడానికే రాహుల్ ఆసక్తి చూపారనే అభిప్రాయాలకు ఆయన చర్యలు తావిస్తున్నాయని పేర్కొంది. పలు రాష్ట్రాల్లో అధికారంలోకి రావడం కోసం ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీల ప్రయోజనాలకు వ్యతిరేకంగా రాహుల్, కాంగ్రెస్ పదేపదే పనిచేస్తున్నట్టు ఆ సంపాదకీయం ఆరోపించింది. తమిళనాడులో కూటమి బ్యానర్‌పై పోటీ చేసి, సీట్లు గెలిచిన తర్వాత డీఎంకేను కాంగ్రెస్ వంచించిందని విమర్శించింది.








