అప్పుల ఊబిలో తమిళనాడు.. ఒక్కో చిన్నారిపై రూ. 1.28 లక్షల భారం
తమిళనాడు (Tamil Nadu) రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) ప్రభుత్వం శ్వేతపత్రం (White Paper) విడుదల చేసింది. గత డీఎంకే (DMK) ప్రభుత్వ హయాంలో రాష్ట్రం తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆర్థిక మంత్రి మేరీ విల్సన్ ఈ పత్రంలో వెల్లడించారు. ఒకవైపు రాష్ట్ర ఆర్థిక దుస్థితిని వివరిస్తూనే, మరోవైపు రైతులకు ఇచ్చిన మాట ప్రకారం వ్యవసాయ రుణమాఫీని సీఎం విజయ్ ప్రకటించారు.
రూ. 13.1 లక్షల కోట్లకు చేరిన అప్పులు
రాష్ట్ర (Tamil Nadu) ఖజానా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో వివరిస్తూ ప్రభుత్వం పలు సంచలన గణాంకాలను బయటపెట్టింది:
భారీగా అప్పులు: రాష్ట్ర మొత్తం అప్పులు రికార్డు స్థాయిలో రూ.13.18 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇందులో డైరెక్ట్ (ప్రత్యక్ష) రుణాలే ఏకంగా రూ.10 లక్షల కోట్ల వరకు ఉన్నాయి.
రెట్టింపైన రుణాలు: ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని గత ఐదేళ్ల పాలనలోనే అప్పులు దాదాపు రెట్టింపయ్యాయి. డీఎంకే అధికారంలోకి రాకముందు రూ.4.8 లక్షల కోట్లుగా ఉన్న ప్రత్యక్ష రుణాలు, కేవలం ఐదేళ్లలో రూ.10 లక్షల కోట్లకు పైగా పెరిగాయి.
చిన్నారిపై భారం: అప్పుల పెరుగుదల కారణంగా.. ప్రస్తుతం తమిళనాడులో (Tamil Nadu) పుట్టే ప్రతి పిల్లాడి తలపై సగటున రూ.1.28 లక్షల రుణ భారం ఉంది.
అభివృద్ధి శూన్యం: గత ఆరు దశాబ్దాల్లో చేసిన అప్పులకంటే ఈ ఐదేళ్లలోనే ఎక్కువ అప్పులు చేశారని, వాటిని మౌలిక సదుపాయాల కల్పనకు కాకుండా కేవలం రోజువారీ ఖర్చులకే వినియోగించారని ఆర్థిక మంత్రి మేరీ విల్సన్ తీవ్రంగా విమర్శించారు. బడ్జెటేతర రుణాలు, ప్రభుత్వ గ్యారంటీలు అన్నీ కలుపుకుంటేనే మొత్తం (Tamil Nadu) అప్పు రూ.13.18 లక్షల కోట్లకు చేరిందని ఆయన స్పష్టం చేశారు.
అన్నదాతలకు ఊరట
రాష్ట్రం (Tamil Nadu) ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి విజయ్ రైతులకు భారీ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నారు. సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన కీలక సమావేశం అనంతరం రుణమాఫీని అధికారికంగా ప్రకటించారు. గతేడాది మే 1 నుంచి ఈ ఏడాది (2026) ఫిబ్రవరి 28 మధ్య సహకార బ్యాంకుల ద్వారా పంట రుణాలు తీసుకున్న రైతులకు ఈ మాఫీ వర్తిస్తుంది. వాస్తవానికి గత నెలలో రూ.50 వేల లోపు రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే పలు రైతు సంఘాలు ముఖ్యమంత్రిని కలిసి చేసిన విజ్ఞప్తి మేరకు ఆ పరిమితిని రూ.75 వేలకు పెంచుతూ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవేళ రూ.75 వేల కంటే ఎక్కువ రుణం తీసుకున్న రైతులు ఉంటే, వారికి సైతం ఏకమొత్తంగా రూ.35 వేల వరకు రుణాన్ని మాఫీ చేస్తారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 14.43 లక్షల మంది రైతులుకు లబ్ది చేకూరనుంది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై అదనంగా సుమారు రూ.5,932 కోట్ల భారం పడనుంది.








