షాకింగ్ టర్న్ : ‘వారణాసి’ తర్వాత మహేష్ చేయబోయే సినిమా ఇదేనా?!
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కెరీర్లోనే అతిపెద్ద ప్రయాణంలో ఉన్నారు. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళితో చేస్తున్న భారీ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ (వర్కింగ్ టైటిల్)పై దేశవ్యాప్తంగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా విడుదలైన తర్వాత బాక్సాఫీస్ రికార్డులు మారిపోతాయని అభిమానులు నమ్ముతున్నారు. అయితే ఇప్పుడు టాలీవుడ్లో మరో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. అదే రాజమౌళి సినిమా తర్వాత మహేష్ బాబు ఎలాంటి సినిమా చేస్తారు? అని
అందుతున్న సమాచారం మేరకు …స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఎంతవరకూ నిజం..ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారు…ఈ వార్తను ఎంతవరకూ నమ్మచ్చు.
ఈ ప్రశ్నకు సమాధానం వెతికితే, దాని వెనుక ఒక ఆసక్తికరమైన సినీ సైకాలజీ కనిపిస్తుంది.
భారీ యాక్షన్ సినిమాలు, పాన్ ఇండియా ప్రాజెక్టులు, ఫాంటసీ అడ్వెంచర్లు చేసిన హీరోలు తర్వాత అందుకు పూర్తి రివర్స్ లో చాలా లైటర్ వీన్ అంటే తేలికైన సినిమాలు ఎంచుకోవడం కొత్త విషయం కాదు. చాలామంది దీన్ని శారీరక అలసటతో ముడిపెడతారు. నెలల తరబడి షూటింగ్‌లు, యాక్షన్ సీక్వెన్సులు, మేకోవర్లు హీరోలను అలసటకు గురి చేసి ఉంటాయని కాబట్టి ఇలాంటి సినిమాలు ఎంచుకుంటారని భావిస్తారు.
అది కొంతవరకు నిజమే. కానీ అసలు కారణం మరొకటి.అదే అంచనాల భారం ఒక భారీ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత ప్రేక్షకుల అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతాయి. ఆ తర్వాత వచ్చే ప్రతి సినిమాను ఆ బ్లాక్బస్టర్తోనే పోల్చడం మొదలవుతుంది. అందులోనూ రాజమౌళి సినిమా తర్వాత వచ్చే సినిమా ఎప్పుడూ కష్టమైనదే
రాజమౌళి సినిమాలు కేవలం హిట్లు కాదు. అవి ఒక ఈవెంట్‌లా మారిపోతాయి. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కొత్త రికార్డులు నమోదవుతాయి. హీరోల మార్కెట్, ఇమేజ్ మరో స్థాయికి చేరతాయి. అలాంటి సినిమా తర్వాత హీరో ఏ సినిమా చేసినా, ప్రేక్షకుల మొదటి ప్రశ్న ఒకటే. “ఇది రాజమౌళి సినిమా స్థాయిలో ఉందా?” అక్కడే సమస్య మొదలవుతుంది.సినిమా బాగున్నా, కథ బాగున్నా, వినోదం ఉన్నా… ముందు వచ్చిన భారీ చిత్రంతో పోలిక తప్పదు. అదే చాలా మంది స్టార్ హీరోలను జాగ్రత్తగా ఆలోచించేలా చేస్తుంది.
ప్రభాస్ నుంచి ఎన్టీఆర్ వరకు ఇదే పరిస్థితి
‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చేసిన ప్రతి సినిమాను ప్రేక్షకులు ‘బాహుబలి’తోనే పోల్చారు. సినిమా ఎంత బాగున్నా, చర్చ ఎక్కువగా పోలికల చుట్టూనే తిరిగింది. అదే విధంగా ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల సినిమాలపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇది వారి తప్పు కాదు. వారి విజయాల వల్ల వచ్చిన సహజమైన పరిణామం.
ఇవి కూడా చదవండి
పెద్ద విజయం తర్వాత వచ్చే సినిమా ఎప్పుడూ ఒక పరీక్షలాంటిదే.అందుకే స్టార్లు జానర్ మార్చేస్తారు. ఇక్కడే తెలివైన వ్యూహం కనిపిస్తుంది. భారీ యాక్షన్ సినిమా తర్వాత మళ్లీ మరో భారీ యాక్షన్ సినిమా చేస్తే ప్రేక్షకులు మరింత పెద్ద అంచనాలతో వస్తారు. కానీ అదే సమయంలో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, కామెడీ, స్పోర్ట్స్ డ్రామా లేదా భావోద్వేగ కథ చేస్తే పరిస్థితి మారుతుంది.
ప్రేక్షకుడు కూడా దాన్ని వేరే జానర్‌గా చూస్తాడు. పోలికలు తగ్గుతాయి. సినిమా తనదైన స్థాయిలో నిలబడే అవకాశం పెరుగుతుంది. ఇది కేవలం టాలీవుడ్లోనే కాదు, హాలీవుడ్లో కూడా ఎన్నోసార్లు కనిపించిన వ్యూహం. యాక్షన్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న సిల్వెస్టర్ స్టాలోన్ ‘ఆస్కార్’ వంటి కామెడీ చిత్రంలో నటించారు. ఆర్నాల్డ్ ష్వార్జెనెగ్గర్ కూడా ‘టెర్మినేటర్’ తర్వాత ‘ట్విన్స్’, ‘కిండర్‌గార్టెన్ కాప్’ వంటి వినోదాత్మక చిత్రాలతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. వాళ్లు యాక్షన్‌ను వదిలేయలేదు. కానీ ప్రేక్షకుల అంచనాల నుంచి కాసేపు బయటకు వచ్చి కొత్త కోణాన్ని చూపించారు.
మహేష్‌కు స్పోర్ట్స్ డ్రామా ఎందుకు సరిపోవచ్చు?
ప్రస్తుతం వినిపిస్తున్న ప్రచారం ప్రకారం, మహేష్ బాబుకు ఒక స్పోర్ట్స్ ఆధారిత ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథ వినిపించారట. అందులో ఆయన కోచ్ పాత్రలో కనిపించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇది నిజమో కాదో తెలియదు. కానీ అలాంటి కథ ఆయన కెరీర్‌కు సరిపోయే అవకాశాలు మాత్రం ఉన్నాయి.
రాజమౌళి సినిమా తర్వాత మళ్లీ ప్రపంచాన్ని కాపాడే యాక్షన్ హీరోగా కాకుండా, కుటుంబ ప్రేక్షకులను అలరించే కోచ్‌గా కనిపిస్తే అది ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. అదే సమయంలో భారీ అంచనాల ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.
డైరెక్టర్ ఎవరు?
మహేష్ బాబు తదుపరి సినిమా ఎవరి దర్శకత్వంలో ఉంటుందో ఇంకా స్పష్టత లేదు. బుచ్చిబాబు, అనిల్ రావిపూడి, సందీప్ రెడ్డి వంగా… పేర్లు చాలా వినిపిస్తున్నాయి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. రాజమౌళి సినిమా తర్వాత మహేష్‌కు కావాల్సింది కేవలం ఒక హిట్ సినిమా కాదు. ప్రేక్షకుల అంచనాలను తెలివిగా మేనేజ్ చేసే సినిమా. అందుకే స్పోర్ట్స్ డ్రామా, ఫ్యామిలీ ఎంటర్టైనర్ లేదా లైట్-హార్టెడ్ కమర్షియల్ సినిమా అనే వార్తలు వినిపిస్తున్నాయి.
రాజమౌళి సినిమా తర్వాత మహేష్‌కు అవసరమయ్యేది కేవలం “లైట్ సినిమా” కాదు.రాజమౌళి సృష్టించే కొండంత అంచనాల నుంచి బయటపడే సినిమా. అందుకే స్పోర్ట్స్ డ్రామా, ఫ్యామిలీ ఎంటర్టైనర్, లేదా ఫన్ మూవీ అనే ఆలోచన వినిపిస్తే… అది వెనకడుగు కాదు.అది ఒక స్టార్ కెరీర్లో అత్యంత తెలివైన ముందడుగు కావచ్చు.
ఎందుకంటే కొన్నిసార్లు కెరీర్లో ముందుకు వెళ్లాలంటే కొండ వెనక మరొక కొండ అలా ఎక్కుకుంటూ పోకూడదు.కొండ దిగిపోయి, ప్రేక్షకులతో కలిసి కొంతదూరం నడవాలి.








