ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో ఉచిత భోజనం కట్.. కొత్తగా ‘బేసిక్ ఫేర్’ కేటగిరీ
పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, తీవ్రమవుతున్న ధరల పోటీ నేపథ్యంలో దేశీయ విమానయాన దిగ్గజం ‘ఎయిర్ ఇండియా‘ (Air India) కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ ప్రయాణికులను ఆకర్షించడంతో పాటు, ఖర్చులను నియంత్రించుకునే వ్యూహంలో భాగంగా సరికొత్త ‘బేసిక్ ఫేర్’ (Basic Fare) టికెట్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది. అదనపు సౌకర్యాల కంటే టికెట్ ధరకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే బడ్జెట్ ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ఈ ఆఫర్‌ను తీసుకురావడం గమనార్హం.
‘బేసిక్ ఫేర్’లో సదుపాయాలు ఇవే..
ఉచిత భోజనం కట్: ఈ బేసిక్ ఫేర్ కింద టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు విమానంలో (Air India) ఉచిత భోజనం (Complimentary Meals) అందించరు.
ఉచిత పానీయాలు: భోజనం లేకపోయినప్పటికీ, ప్రయాణ సమయంలో టీ లేదా కాఫీ వంటి బేసిక్ పానీయాలను మాత్రం ఉచితంగా అందిస్తారు.
బ్యాగేజ్ అనుమతి: ఈ టికెట్ కేటగిరీలో 15 కిలోల చెక్-ఇన్ బ్యాగేజ్, 7 కిలోల వరకు క్యాబిన్ బ్యాగేజ్ తీసుకువెళ్లేందుకు అనుమతి ఉంటుంది.
ప్రయోగాత్మకంగా కొన్ని రూట్లలోనే..
ప్రస్తుతం ఈ కొత్త ఫేర్ విధానాన్ని ఎయిర్ ఇండియా (Air India) కొన్ని ఎంపిక చేసిన దేశీయ రూట్లలో మాత్రమే ప్రయోగాత్మకంగా (పైలట్ ప్రాజెక్ట్) అమలు చేస్తోంది. ఈ బేసిక్ టికెట్లపై ప్రయాణికుల నుంచి వచ్చే స్పందనను బట్టి.. భవిష్యత్తులో దీనిని మరిన్ని దేశీయ మార్గాలకు విస్తరించాలా? లేదా? అన్నదానిపై సంస్థ (Air India) తుది నిర్ణయం తీసుకోనుంది.
పాత కేటగిరీలు యథాతథం..
బేసిక్ ఫేర్ అందుబాటులోకి వచ్చినప్పటికీ, ప్రయాణికులకు ఎప్పటిలాగే పాత కేటగిరీలైన వాల్యూ, క్లాసిక్, ఫ్లెక్స్ ఫేర్ టికెట్లు కూడా అందుబాటులోనే ఉంటాయి. ఈ టికెట్లు బుక్ చేసుకున్న వారికి ఉచిత మీల్స్‌తో పాటు ఇతర అదనపు ప్రయోజనాలు యథాతథంగా కొనసాగుతాయని ఎయిర్ ఇండియా (Air India) స్పష్టం చేసింది. ప్రయాణికుల విభిన్న అవసరాలకు అనుగుణంగా సేవలను అందించాలనే సంస్థ ఆపరేషనల్ వ్యూహంలో ఇది కీలక అడుగుగా విశ్లేషకులు భావిస్తున్నారు.








