వేగంగా ఎదుగుతున్న భారత్.. జీడీపీ వృద్ధి 6.6 శాతంగా ఉంటుందన్న వరల్డ్ బ్యాంక్
ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు వణికిస్తున్నప్పటికీ.. భారత ఆర్థిక వ్యవస్థ (Indian Economy) మాత్రం అత్యంత పటిష్టమైన వృద్ధితో మునుపటి కంటే బలంగా కొనసాగుతోందని ప్రపంచ బ్యాంక్ (World Bank) నివేదిక స్పష్టం చేసింది. రాబోయే 2026-27 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ (GDP) వృద్ధి రేటు గతంలో నమోదైన 7.7 శాతం నుంచి 6.6 శాతానికి కొంత మందగించే అవకాశం ఉన్నట్లు సంస్థ అంచనా వేసింది. అయినప్పటికీ ప్రపంచంలోని అతిపెద్ద, ప్రధాన ఆర్థిక వ్యవస్థలన్నింటిలోకీ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా భారత్ తన అగ్రస్థానాన్ని పదిలపరుచుకుంటుందని నివేదిక కొనియాడింది.
దేశీయ డిమాండే కొండంత అండ..
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల మంట, ఇంధన వ్యయాలు, పరిశ్రమల ఉత్పత్తి ఖర్చులు (ఇన్పుట్ కాస్ట్) భారీగా పెరగడం వల్ల దేశీయంగా వినియోగం, పెట్టుబడులపై కొంత ప్రతికూల ప్రభావం పడుతున్న మాట వాస్తవమేనని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. అయితే ఈ సవాళ్లను అధిగమించడంలో దేశీయంగా ఉన్న విపరీతమైన డిమాండ్ (Domestic Demand) భారత ఆర్థికవ్యవస్థకు (Indian Economy) ఒక బలమైన రక్షణ కవచంలా మద్దతుగా నిలుస్తోందని విశ్లేషించింది. ముఖ్యంగా దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల వినియోగ సామర్థ్యం బలంగా ఉందని, అటు పట్టణ మార్కెట్లలో కూడా వ్యాపార పునరుద్ధరణ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని నివేదిక వెల్లడించింది.
7.2 శాతానికి రీబౌండ్!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి (Indian Economy) రేటు 6.6 శాతానికి తగ్గినప్పటికీ, ఈ మందగమనం ఎంతమాత్రం దీర్ఘకాలికం కాదని ప్రపంచ బ్యాంక్ ఆశాభావం వ్యక్తం చేసింది. తదుపరి 2027-28 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి రేటు మళ్లీ పుంజుకుని ఏకంగా 7.2 శాతానికి చేరుకునే బలమైన అవకాశాలు మెండుగా ఉన్నాయి. దేశీయ మార్కెట్లలో డిమాండ్ మరింత ఊపందుకోవడం, అంతర్జాతీయంగా భారత ఎగుమతులు మళ్లీ ట్రాక్‌లోకి రావడం, వివిధ దేశాలతో కుదుర్చుకుంటున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (FTAs) ద్వైపాక్షిక ప్రయోజనాలు.. భవిష్యత్తులో భారత ఆర్థిక ప్రగతికి (Indian Economy) ప్రధాన చోదక శక్తులుగా నిలవనున్నాయి. మొత్తంగా దక్షిణాసియా (South Asia) ప్రాంతం సాధించే సగటు వృద్ధి రేటులో అత్యధిక భాగం భారతదేశ ఆర్థిక విస్తరణపైనే ఆధారపడి ఉందని, ఈ ప్రాంత ప్రగతికి భారతే ఇంధనంగా పనిచేస్తోందని ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రశంసించింది.








