అమెజాన్ డేటా సెంటర్ల భారీ దాహం.. ఏడాదికి 900 కోట్ల లీటర్ల నీళ్లు తాగేస్తున్నాయ్!
టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వాడకం పెరిగే కొద్దీ పర్యావరణంపై పడుతున్న భారం అంతాఇంతా కాదు. సమాచారాన్ని భద్రపరిచే భారీ ‘డేటా సెంటర్లు’ భూగర్భ జలాలను విపరీతంగా తోడేస్తున్నాయన్న ఆందోళనల మధ్య, గ్లోబల్ టెక్ దిగ్గజం ‘అమెజాన్’ (Amazon) ఒక షాకింగ్ నివేదికను బయటపెట్టింది. 2025 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ డేటా సెంటర్ల నిర్వహణ కోసం ఏకంగా 900 కోట్ల లీటర్ల (2.5 బిలియన్ గ్యాలన్లు) నీటిని వినియోగించినట్లు బహిరంగంగా వెల్లడించింది. ఏఐ టూల్స్ పర్యావరణంపై చూపుతున్న ప్రభావంపై చర్చ జరుగుతున్న తరుణంలో అమెజాన్ ఈ డేటాను రిలీజ్ చేయడం గమనార్హం.
ప్రత్యర్థుల కన్నా పొదుపేనంటున్న అమెజాన్
900 కోట్ల లీటర్ల నీరు చాలా భారీ సంఖ్య అయినప్పటికీ.. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి తమ ప్రత్యర్థి టెక్ సంస్థలతో పోలిస్తే తామే ఎంతో పొదుపుగా నీటిని వాడుతున్నామని అమెజాన్ (Amazon) సమర్థించుకుంటోంది.
తక్కువ నీటి వాడకం: తమ డేటా సెంటర్లలో ప్రతి కిలోవాట్-అవర్ (kWh) విద్యుత్ వాడకానికి కేవలం 0.12 లీటర్ల నీటిని మాత్రమే వినియోగిస్తున్నట్లు అమెజాన్ తెలిపింది. ఇది గూగుల్ జెమిని సెంటర్ల వాడకం కంటే చాలా తక్కువని స్పష్టం చేసింది.
వింత లాజిక్: అమెరికా ప్రజలు తమ ఇళ్లలోని తోటలు, లాన్ల (Lawns) నిర్వహణ కోసం ఏడాదిలో వాడే నీటితో పోలిస్తే, తమ డేటా సెంటర్లు వాడే నీరు 1300 రెట్లు తక్కువని అమెజాన్ (Amazon) ఒక లాజిక్‌ను తెరపైకి తెచ్చింది.
మండిపడుతున్న పర్యావరణ నిపుణులు
అమెజాన్ విడుదల చేసిన ఈ డేటాపై పర్యావరణ నిపుణులు పెదవి విరుస్తున్నారు. కంపెనీ కేవలం డేటా సెంటర్ల ‘నిర్వహణ’కు (కూలింగ్ వ్యవస్థలకు) వాడిన నీటి లెక్కలను మాత్రమే చూపిస్తోందని.. కొత్త డేటా సెంటర్ల నిర్మాణం కోసం భారీగా వాడుతున్న నీటి లెక్కలను ఇందులో ఉద్దేశపూర్వకంగానే దాచిపెట్టిందని విమర్శిస్తున్నారు.
2030 నాటికి ‘వాటర్ పాజిటివ్’ లక్ష్యం
ప్రస్తుత అంచనాల ప్రకారం.. అమెజాన్ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా సుమారు 924 డేటా సెంటర్లు ఉన్నాయి. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వీటి సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే భవిష్యత్తులో తాము వినియోగిస్తున్న నీటి కంటే ఎక్కువ నీటిని తిరిగి భూమికి, పర్యావరణానికి అందించే (Water Positive) లక్ష్యంతో పనిచేస్తున్నట్లు కంపెనీ (Amazon) తెలిపింది. 2030 నాటికి ఈ వాటర్ పాజిటివ్ మైలురాయిని చేరుకుంటామని అమెజాన్ ధీమా వ్యక్తం చేస్తోంది.








