రోడ్డు ప్రమాదాలకు చెక్.. ఒకదానితో ఒకటి ‘మాట్లాడుకునే’ వాహనాలు..!
భారతదేశంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆటోమొబైల్ రంగంలో మరో విప్లవాత్మక అడుగు (Car Technology) వేసింది. రహదారులపై ప్రయాణించే వాహనాలు ఒకదానితో ఒకటి నేరుగా సమాచారాన్ని పంచుకునే సరికొత్త ‘వాహనం-వాహనం కమ్యూనికేషన్’ (Vehicle-to-Vehicle – V2V) వ్యవస్థ అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ అత్యాధునిక టెక్నాలజీకి సంబంధించిన ముసాయిదా నిబంధనలను (డ్రాఫ్ట్ స్టాండర్డ్స్) కేంద్రం తాజాగా విడుదల చేసింది.
వీ2వీ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది?
ఈ సాంకేతికత ద్వారా రోడ్డుపై వెళ్తున్న వాహనాలు ఒక ప్రత్యేకమైన రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా అనుసంధానమై ఉంటాయి. వాహనాలు తమ వేగం, ప్రయాణిస్తున్న దిశ (లొకేషన్), బ్రేకింగ్ పరిస్థితి వంటి కీలక సమాచారాన్ని ఎప్పటికప్పుడు సమీపంలోని ఇతర వాహనాలకు చేరవేస్తాయి. ముందు వెళ్తున్న వాహనం అకస్మాత్తుగా బ్రేక్ వేసినా, రోడ్డుపై మలుపుల వద్ద ఏదైనా వాహనం నిలిచిపోయినా.. ఈ సిస్టమ్ వెంటనే వెనుక వస్తున్న డ్రైవర్ను అప్రమత్తం చేస్తుంది. వాతావరణం అనుకూలించని సమయాల్లో (పొగమంచు/భారీ వర్షం) లేదా డ్రైవర్ కంటికి కనిపించని (బ్లైండ్ స్పాట్స్) ప్రమాదాలను కూడా ముందుగానే పసిగట్టి ఇది (Car Technology) అలర్ట్ ఇస్తుంది. దీనికోసం టెలికమ్యూనికేషన్స్ శాఖ ఇప్పటికే ఈ వాహనాల కమ్యూనికేషన్ కోసం ఒక ప్రత్యేకమైన రేడియో ఫ్రీక్వెన్సీని కేటాయించడం గమనార్హం.
80 శాతం తగ్గనున్న ప్రమాదాలు
ఈ సరికొత్త సేఫ్టీ టెక్నాలజీ (Car Technology) భారతీయ రవాణా రంగంలో ఒక ‘విప్లవాత్మక మార్పు’ అని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అభివర్ణించారు. ఈ వీ2వీ కమ్యూనికేషన్ వ్యవస్థను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తే.. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలను ఏకంగా 80 శాతం వరకు తగ్గించే అద్భుతమైన సామర్థ్యం దీనికి ఉందని చెప్పారు.
అంచనా వ్యయం
ఈ పరికరాన్ని (డివైజ్) ముందుగా కొత్తగా తయారయ్యే కార్లు, బస్సులు, ట్రక్కులతో పాటు ద్విచక్ర (టూ-వీలర్) వాహనాల్లో అమర్చడాన్ని కేంద్రం తప్పనిసరి చేసే అవకాశముంది. తొలిదశ విజయవంతమైన అనంతరం, రోడ్లపై (Car Technology) ఇప్పటికే తిరుగుతున్న పాత వాహనాల్లో కూడా ఈ టెక్నాలజీని అమర్చేందుకు వీలుగా ప్రభుత్వం భవిష్యత్తులో ప్రత్యేక నిబంధనలను తీసుకురానుంది. ఒక్కో వీ2వీ పరికరం తయారీ, అమర్చడానికి సుమారు రూ. 5,000 నుంచి రూ. 7,000 మధ్య ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా. రాబోయే సంవత్సరాల్లో రోడ్డు భద్రతా ప్రమాణాలను పెంచడంలో ఈ నిర్ణయం ఒక కీలక మలుపుగా మారనుందని ఆటోమొబైల్ రంగ నిపుణులు భావిస్తున్నారు.








