ఎవరు అడ్డుపడినా ఫ్యూచర్ సిటీని నిర్మించి తీరుతాం : రేవంత్ రెడ్డి
ఎవరేమనునుకున్నా మూసీ నది (Musi River) ప్రక్షాళన చేసి తీరుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. హైదరాబాద్‌లోని గుర్రంగూడలో వనమహోత్సవ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కి.మీ. మేర ఈ పనులు చేపడతామని తెలిపారు. సబర్మతి, గంగా రివర్ఫ్రంట్ల కంటే మెరుగ్గా అంతర్జాతీయ స్థాయిలో దీన్ని తీర్చిదిద్దుతామన్నారు. ఎవరూ అడ్డుపడినా భారత్ ఫ్యూచర్ సిటీ (Future City)ని కడతామని, అంతర్జాతీయ కంపెనీలను ఫ్యూచర్ సిటీకి తీసుకువస్తామని, భవిష్యత్ తరాలు భారత్ ఫ్యూచర్ సిటీని చర్చించునేలా నిర్మిస్తామని తెలిపారు. 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తుంటే వద్దంటున్నారని, అక్కడ ఫార్మా కంపెనీలే ఉండాలని, ఫ్యూచర్ సిటీ వద్దని కొందరు పేర్కొంటున్నారని, బిఆర్ఎస్ (BRS) వాళ్ల ఫ్యూచర్‌ను ప్రజలు ఎప్పుడో రద్దు చేశారని ఆయన ఎద్దేవా చేశారు. ఫ్యూచర్ లేని వాళ్లు అంతా ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతున్నారన్నారు. మళ్లీ ఫార్మా కంపెనీలు ఇక్కడ పెట్టుకుందామా? అని ఆయన ప్రశ్నించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో 15 వేల ఎకరాల ఫారెస్ట్‌ను అభివృద్ధి చేస్తున్నామని, 60 శాతం పచ్చదనం ఉంటుందని, దీనిని అడ్డుకోవడానికి హైకోర్టు (High Court)లో, ఎన్జీటీల్లో కొందరు కేసులు వేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.








