పశ్చిమాసియాపై శాంతి వీచిక.. సంతకాలు చేసిన ట్రంప్ , పెజెష్కియాన్..!
మూడు నెలలకు పైగా పశ్చిమాసియాను అతలాకుతలం చేసిన పెను సంక్షోభం ముగిసింది. ఓ వైపు భీకరదాడులు, మరోవైపు ఆర్థిక ముట్టడి.. ఇంకోవైపు.. చర్చలంటూ ట్రంప్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. అమెరికా యుద్ధానికి భయపడని ఇరాన్.. తన దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని.. చర్చలకు సై అంది. సుదీర్ఘ చర్చల అనంతరం.. ఫ్రాన్స్ జీ-7 సమావేశాల సందర్భంగా.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇరాన్ అధినేత పెజెష్కియాన్.. అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఇవి కూడా చదవండి
14 అంశాలతో కూడిన ఈ ఒప్పందానికి ‘ఇస్లామాబాద్ మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ద ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్’ అని పేరు పెట్టారు. కొన్ని రోజుల క్రితం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగేర్ ఘాలిబఫ్ కూడా ఈ ఎంఓయూపై సంతకాలు చేశారు. ఇరుదేశాల అధ్యక్షులు దీనిపై సంతకాలు చేయడంతో.. ఈ డీల్ అమల్లోకి వచ్చింది (USA-Iran sign on MoU).
ఫ్రాన్స్ వేదికగా.. ట్రంప్ సంతకం
జీ7 శిఖరాగ్ర సమావేశం అనంతరం వెర్సైల్స్ ప్యాలెస్‌లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ విందు ఇచ్చారు. ఇక్కడ ట్రంప్(Donald Trump) సంతకాల కార్యక్రమం జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను వైట్‌హౌస్ విడుదల చేసింది. ‘ట్రంప్ వెర్సైల్స్‌లో ఇరాన్‌తో కుదిరిన ఒప్పందంపై సంతకం చేశారు. ఇది శాశ్వత శాంతికి మార్గం సుగమం చేస్తుంది. హర్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకోనుంది. దీంతో త్వరలో ఇంధన ధరలు తగ్గుతాయి’ అని మెక్రాన్ ఓ పోస్టులో రాసుకొచ్చారు. విందు అనంతరం ప్యాలెస్ నుంచి వెళ్తూ.. ఇరాన్‌తో అవగాహన ఒప్పందంపై సంతకం చేసినట్లు ట్రంప్ విలేకరులతో పేర్కొన్నారు. వాస్తవానికి సంతకాల కార్యక్రమం రేపు స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరగాల్సి ఉండగా, ముందుగానే జరగడం గమనార్హం. అయితే, స్విట్జర్లాండ్‌లో ఇరుదేశాల ప్రతినిధుల సమావేశం ఉంటుందని ఇరాన్ అధికారులు తెలిపారు.
తాము కూడా ఈ అవగాహన ఒప్పందంపై సంతకం చేశామని ఇరాన్ విదేశాంగ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ పేర్కొన్నారు. 60 రోజుల ఈ అవగాహన ఒప్పందాన్ని బలహీనపరిచే చర్యలను అమెరికా చేపట్టకూడదన్నారు. ఈ సమయంలో తమపై కొత్త ఆంక్షలు విధించడం గానీ.. ఈ ప్రాంతంలో సైనిక మోహరింపులు పెంచడం వంటివి చేయకూడదని స్పష్టంచేశారు. తమ వద్దనున్న శుద్ధి చేసిన యురేనియం దేశంలోనే ఉంటుందని.. దానిని విదేశాలకు తరలించబోమని తేల్చి చెప్పేశారు.
ఇస్లామాబాద్ ఎంఓయూ..
అమెరికా- ఇరాన్ మధ్య ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించిన పాకిస్థాన్ కూడా ఈ సంతకాల విషయాన్ని ధ్రువీకరించింది. దీన్ని ‘ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం’గా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించుకున్నారు. ఇందులో తొలి అడుగుగా ఇరాన్ తక్షణమే హర్మూజ్‌ను పూర్తిగా తెరుస్తుందని.. అమెరికా నావికా దిగ్బంధాన్ని ఎత్తివేస్తుందని వెల్లడించారు.








