హర్మూజ్ ఓపెన్ అయ్యేది ఎప్పుడో..?
మొన్నటి వరకూ హర్మూజ్ ప్రారంభానికి ఇరాన్ మాత్రమే అడ్డంకిగా అన్ని దేశాలు భావించాయి. ఇరాన్ హర్మూజ్ ను గుప్పిట పట్టిందని… దాన్ని ప్రారంభించాలంటూ ఇరాన్ మీద ఒత్తిడి పెంచుతూ వచ్చాయి. అయితే ఎప్పుడైతే అమెరికా సైతం హర్మూజ్ చుట్టూ నౌకలను మోహరించి, ఇరాన్ నుంచి ఏ నౌక బయటకు పోనివ్వమంటూ దిగ్భందించిందో .. ఇక అప్పటి నుంచి ప్రపంచానికి నిద్రలేదు. ఎందుకంటే అటు నుంచి వారు నౌకలను వదలరు.. ఇటు నుంచి వీరు పోనివ్వరు. అంటే మొత్తానికి మొత్తం హర్మూజ్ సంధి పూర్తిగా దిగ్భందనం జరుగుతోంది.
హర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ నౌకల రాకపోకలపై అమెరికా కట్టుదిట్టమైన దిగ్బంధనాన్ని (Hormuz blockade) కొనసాగిస్తోంది. ఈ విషయంపై అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ (Pete Hegseth) మాట్లాడుతూ.. జలసంధిపై నియంత్రణను మరింత కాలం పొడిగిస్తామన్నారు. హర్మూజ్ చుట్టూ అమెరికా నేవీ దిగ్బంధనాన్ని ఉక్కు కవచంతో పోల్చారు. ఇది శాశ్వత దిగ్బంధనంగా మారే అవకాశమూ ఉందని హెచ్చరించారు. టెహ్రాన్ తన అణ్వాయుధాల తయారీని విడనాడే వరకు ఆ దేశంపై ఒత్తిడి తెస్తూనే ఉంటామన్నారు. అంతర్జాతీయ స్థిరత్వానికి ఇరాన్ నుంచి పొంచి ఉన్న ముప్పును తొలగించడానికే తాము ఈ సాహసోపేతమైన, ప్రమాదకరమైన మిషన్ను చేపట్టామన్నారు.
తమ అనుమతి లేకుండా హర్మూజ్లోకి ఏ రవాణా నౌక రాదని.. బయటకు వెళ్లదని పీట్ హెగ్సెత్ అన్నారు. జలసంధిలోని నౌకలపై దాడులు చేస్తూ.. టెహ్రాన్ సముద్రపు దొంగల ముఠాలా ప్రవర్తిస్తోందన్నారు. తన చర్యలతో సముద్ర భద్రతను అస్థిరపరుస్తోందని ఆరోపించారు. తమ దిగ్బంధనం గల్ఫ్ దాటి విస్తరిస్తోందన్నారు. అంతర్జాతీయ వాణిజ్యాన్ని కాపాడడానికి తాము ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటామన్నారు. ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ పరోక్ష చర్చలకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో హెగ్సెత్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.








