పాక్ మంత్రి వ్యాఖ్యలతో రచ్చ .. ఇజ్రాయెల్ తో ముదిరిన దౌత్య పోరు
Israel : అమెరికా , ఇరాన్ మధ్య ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలు జరగనున్న తరుణంలో పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులను నరమేధంగా అభివర్ణిస్తూ ఆయన సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టు ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చిచ్చు పెట్టింది. ఇజ్రాయెల్ను తీవ్ర పదజాలంతో విమర్శిస్తూ ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలపై ఆ దేశం గట్టిగా స్పందించింది.
ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహం:
మానవాళికి ఇజ్రాయెల్ ఒక శాపమని , ఆ దేశాన్ని ఒక వ్యాధితో పోలుస్తూ ఖవాజా చేసిన వ్యాఖ్యలను ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం తీవ్రంగా ఖండించింది. శాంతి చర్చల్లో తటస్థంగా ఉంటామని చెబుతున్న పాకిస్థాన్ నుండి ఇలాంటి విద్వేషపూరిత ప్రకటనలు రావడం సహించరానిదని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియాన్ సర్ హెచ్చరించారు. తన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత రావడంతో మంత్రి ఖవాజా ఆ పోస్టును తొలగించినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
శాంతి చర్చలపై ప్రభావం:
అమెరికా , ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణను శాశ్వత శాంతి ఒప్పందంగా మార్చేందుకు పాకిస్థాన్ వేదికగా చర్చలు జరగాల్సి ఉంది. ఇలాంటి కీలక సమయంలో ఇజ్రాయెల్ , పాక్ మధ్య వివాదం తలెత్తడం చర్చల వాతావరణంపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు హర్మూజ్ జలసంధి నిర్వహణను కొత్త దశకు తీసుకెళ్తామని మొజ్తాబా ఖమేనీ చేసిన వ్యాఖ్యలు కూడా అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.








