మైనర్లకు సోషల్ మీడియా బ్యాన్..బ్రిటన్ కీలక నిర్ణయం..!
చిన్నారుల భద్రత, ఆరోగ్య పరిరక్షణ దిశగా బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.పదహారేళ్లకన్నా తక్కువ వయసున్న పిల్లలు సోషల్ మీడియా వాడకంపై బ్రిటన్ నిషేధం విధించింది. సామాజిక మాధ్యమాలు పసి హృదయాలపై దుష్ప్రభావం చూపుతున్నాయని ఆందోళనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో బ్రిటన్ కఠిన చర్యలు తీసుకుంది. బాలల భద్రత, సంతోషం కోసమే ఈ చర్య తీసుకున్నట్టు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రకటించారు.
దేశ ప్రధానిగా, ఒక తండ్రిగా తాను సరైన నిర్ణయం తీసుకున్నానంటూ జాతినుద్దేశించి ప్రసంగించారు కీర్ స్టార్మర్. ఈ నిర్ణయం తీసుకునే ముందు వేలాది మంది తల్లిదండ్రులతో ప్రభుత్వం విస్తృతంగా సంప్రదింపులు జరిపిందని స్టార్మర్ తెలిపారు. ముఖ్యంగా టిక్‌టాక్, స్నాప్‌చాట్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి వేదికల వల్ల పిల్లలు ప్రతికూల సమాచార ప్రభావానికి గురవుతున్నారని అనేకమంది ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిపారు.
‘‘ఈ నిషేధం ప్రపంచంలోనే అతి శక్తివంతమైన టెక్ కంపెనీలతో ముడిపడిన వ్యవహారమని తనకు తెలుసన్నారు కీర్ స్టార్మర్. అయితే పిల్లల ఆరోగ్యం, శ్రేయస్సు అన్నిటికన్నా ముఖ్యం. మేం తీసుకున్నది చాలా పెద్ద చర్య. ఇది మన పిల్లల్లో, మన భవితవ్యంలో పెనుమార్పు తేనుంది. పదహారేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లల సోషల్ మీడియా వాడకాన్ని నిషేధిస్తున్నాను’’ అని స్టార్మర్ ప్రకటించారు. ‘‘నా పిల్లల ఆనందాన్నే నేను కోరుకుంటానని గుండెలమీద చేయి పెట్టుకొని చెబుతున్నాను. తల్లిదండ్రులందరూ అదే కోరుకుంటారు. పిల్లల ఆనందాన్ని సోషల్ మీడియా హరిస్తోంది. వాళ్లు సోషల్ మీడియాలో వేధింపులకు, బెదిరింపులకు గురవుతున్నారు. దీని కారణంగా వారి మానసిక ఆరోగ్యం దెబ్బతింటోంది కూడా. ప్రమాదకరమైన సమాచారాన్ని వారి అందుబాటులోకి తెస్తోంది సోషల్ మీడియా’’ అని తెలిపారు.
ప్రతిపాదిత నిషేధంలో అన్ని డిజిటల్ సేవలు ఉండవు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సమాచారం కోసం ఉపయోగించే వాట్సప్ వంటి మెసేజింగ్ యాప్‌లకు మినహాయింపు ఇవ్వనున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం వెల్లడించింది. అయితే గేమింగ్ సేవలు, లైవ్ స్ట్రీమింగ్ వేదికలు, అపరిచిత వ్యక్తులు పిల్లలతో నేరుగా సంప్రదించగలిగే ప్లాట్‌ఫాôలపై మాత్రమే కఠిన పరిమితులు విధించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక వయో నిర్ధారణ వ్యవస్థను రూపొందించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ నిషేధం ఏ విధంగా అమలు అవుతుందన్నది సంస్కృతి, మీడియా, క్రీడల విభాగం నిర్ణయిస్తుంది.








