ఇరాన్ అణుకార్యక్రమం వదులుకుంటుందా..? అమెరికన్లలో అనుమానాలు..!
ఇరాన్ తో ఒప్పందమైతే కుదిరింది. కానీ.. అమెరికన్లలో అనుమానాలు మాత్రం అలానే ఉన్నాయి. ఓవైపు అధ్యక్షుడు ట్రంప్ ఏమో.. ఇరాన్ ఎప్పటికీ అణ్వస్త్రాలను సమకూర్చుకోలేదు. అలా దెబ్బతీశాం. ఒప్పందంలో ఆ విషయం కూడా ఉందంటున్నారు. కానీ.. ఇరాన్ వైఖరిచూస్తే అలా అనిపించడం లేదంటోంది అమెరికా అధికార యంత్రాంగంలో ఓ వర్గం. అసలు ఇరాన్ ను నమ్మలేమని ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఈ ఒప్పందం ట్రంప్ (Donald Trump) యంత్రాంగంలో విభేదాలను బయటపెట్టింది. అణ్వాయుధాలు విడిచిపెట్టాలన్న నిర్ణయానికి ఇరాన్ కట్టుబడి ఉంటుందా అనే విషయంపై కొందరు సీనియర్ అధికారులు అనుమానాలు వ్యక్తంచేసినట్లు అమెరికా మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఒప్పందం తుది దశకు చేరుకుంటున్న నేపథ్యంలో.. ఇరాన్ ఉద్దేశాలపై నిఘా వర్గాల అంచనాలు ఆందోళనను రేకెత్తిస్తున్నాయని సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్ (CIA Director John Ratcliffe) ట్రంప్‌తో సహా ఉన్నతాధికారులను హెచ్చరించారు. ఒప్పందం నేపథ్యంలో శుద్ధి చేసిన యురేనియం విషయంలో ఇరాన్ (Iran) అధికారుల మధ్య చర్చలకు.. వారు మధ్యవర్తులకు చేరవేస్తున్న సమాచారానికి ఎక్కడా పొంతన లేదని తెలుస్తోందన్నారు. అమెరికా డిమాండ్ చేస్తున్నట్లు అణ్వాయుధాలు విడిచిపెట్టేందుకు ఇరాన్ సిద్ధంగా లేదని నిఘా వర్గాలు సూచిస్తున్నాయని తెలిపారు. రాట్‌క్లిఫ్‌తో పాటు విదేశాంగ మంత్రి మార్కో రూబియో (Marco Rubio), రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ (Pete Hegseth)లు కూడా అంతర్గత చర్చల్లో ఇదే ఆందోళనను వ్యక్తంచేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, పశ్చిమాసియా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్లు మాత్రం ఒప్పందానికి తమ మద్దతు తెలిపారు.
వైట్‌హౌస్ మాత్రం ఈ వార్తలను తోసిపుచ్చింది.. శాంతి ఒప్పందంపై తుది నిర్ణయం తీసుకునే ముందు ట్రంప్ భిన్నాభిప్రాయాలు పరిగణనలోకి తీసుకున్నట్లు వైట్ హౌస్ ప్రతినిధులు తెలిపారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని కలిగిఉండకూడదని, శుద్ధి చేసిన యురేనియంను వారి వద్ద ఉంచుకోకూడదు అన్న కీలక షరతులతో ఈ ఒప్పందం చాలా స్పష్టంగా ఉందన్నారు. ఈ విషయంపై సీఐఏ, విదేశాంగ శాఖ స్పందించేందుకు నిరాకరించాయి.








