టోల్ ప్లేసులో సర్వీస్ చార్జ్.. హర్మోజ్ పై ఇరాన్ కొత్త మెలిక..!
ఓ వైపు శాంతి ఒప్పందంపై సంతకాలు జరగకముందే.. ఇరాన్ హర్మోజ్ విషయంలో సరికొత్త మెలిక పెట్టింది. . టోల్ ఉండదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగా.. కొంత సర్వీస్ ఛార్జీగా వసూలుచేస్తామని ఇరాన్ చెప్తోంది (Trump-Iran). ఈ ఛార్జీల విషయాన్ని ఆ దేశ విదేశాంగశాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బకేయి మీడియాకు వెల్లడించారు.
‘‘నౌకలు హర్మూజ్ (Strait of Hormuz)లో ప్రయాణిస్తున్నందుకు ట్రాన్సిట్ టోల్ వసూలు చేయబోం. ఇదే విషయాన్ని ఎప్పటినుంచో చెప్తున్నాం. అయితే నావిగేషన్ సర్వీసులు, పర్యావరణ పరిరక్షణ, నౌకలకు బీమా, ఇతర సముద్రయాన సర్వీసులకు మాత్రం ఛార్జీలు వసూలు చేస్తాం’’ అని వెల్లడించారు. అలాగే యుద్ధం ముగించేందుకు ఒక ఒప్పందానికి వచ్చినప్పటికీ.. అమెరికాను విశ్వసించలేమని పేర్కొన్నారు. గత అనుభవాలే తమ అభిప్రాయానికి కారణమని తెలిపారు.
అంతర్జాతీయ సముద్ర చట్టాన్ని పర్యవేక్షించే యునైటెడ్ నేషన్స్ ఒప్పందాల ప్రకారం.. తమ సరిహద్దుగా ఉన్న జలసంధి మీదుగా నౌకలు వెళ్లడానికి ఆయా దేశాలు ఫీజు వసూలుచేయడానికి అనుమతి లేదు. అయితే పైలటింగ్, టగ్గింగ్, పోర్ట్ సర్వీసులు అందిస్తే.. పరిమిత స్థాయిలో ఫీజు వసూలు చేసుకోవచ్చు. ఈ ఫీజు పేరిట ఏ దేశాన్నీ లక్ష్యంగా చేసుకోకూడదు. జలసంధి సహజంగా ఏర్పడుతుంది. అలాకాకుండా తవ్వడం ద్వారా ఏర్పడిన కాలువలను జలసంధికి భిన్నంగా పరిగణిస్తారు.
అదే సమయంలో అంతర్జాతీయ వాణిజ్యంలో కీలకమైన సూయిజ్, పనామా కాలువల విషయంలో ఈజిప్ట్, పనామా దేశాలు కొంత రుసుము వసూలు చేయడానికి అనుమతి ఉంది. సూయిజ్‌కు ఈజిప్ట్ కొంత భూమి ఇవ్వడం వల్లే ఆ అనుమతి లభించింది. కాగా.. సుంకాలు విధిస్తే హర్మూజ్‌లో యుద్ధానికి ముందున్న స్థితి ఎప్పటికీ తిరిగి రాకపోవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది.








