మహిళల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి : పవన్ కల్యాణ్
రాజకీయాల్లో విమర్శలు విధానపరంగానే ఉండాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత (Home Minister Anita)పై ఓ మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మహిళల కట్టూబొట్టుపై కామెంట్స్ చేసే స్థాయికి ఆ నాయకుడి పార్టీవారు దిగజారిపోయారంటూ వ్యాఖ్యానించారు. మహిళల (Womens) గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఆ వ్యాఖ్యలు కేవలం హోం మంత్రిని అన్నట్టే కాదని, సగటు మహిళలందరినీ కించపరచినట్లే అని అన్నారు. ప్రజా జీవితంలో ఉన్నవారి నోటి నుంచి వచ్చే ప్రతి మాటను పౌర సమాజం గమనిస్తోందనే విషయాన్ని మరచిపోవద్దని అన్నారు. రాజకీయాల్లో (politics) విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయని, అవి విధానపరంగానే ఉండాలన్నారు. ఒక పాలసీ నచ్చకపోతే ఆ పాలసీ విషయంపైనే విమర్శించాలన్నారు. కూటమి నేతలందరూ పౌర సమాజం హర్షించే భాషలో మాట్లాడి బలంగా బదులివ్వాలన్నారు. అవతలి పార్టీవాళ్ల మాదిరి దిగజారుడు భాష, అర్థరహిత వ్యాఖ్యలు కూటమి నేతలకు అవసరం లేదని స్పష్టం చేశారు.








