‘సింగ్ గీతం’ పై ప్రశంసలు కురిపించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్
లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గోల్డెన్ బ్లాక్ బస్టర్ ‘సింగ్ గీతం’ చిత్రానికి ప్రశంసలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్, చిత్ర బృందాన్ని అభినందిస్తూ ఎమోషనల్ నోట్ ని పంచుకున్నారు.
‘సింగ్ గీతం’ హృదయాన్ని తాకే అద్భుతమైన సినీ అనుభూతి అని పేర్కొన్న ఎన్టీఆర్, 94 ఏళ్ల వయసులో కూడా సింగీతం శ్రీనివాసరావు గారి సృజనాత్మకత, కథల పట్ల ఉన్న తపన, ఆలోచనా విధానం తనను ఆశ్చర్యపరిచాయని అన్నారు. తరతరాల సినీ అభిమానులకు ఆయన ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తారని కొనియాడారు.
ఈ చిత్రాన్ని నిర్మించిన నాగ్ అశ్విన్ను ఎన్టీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. దశాబ్దాలుగా సింగీతం గారి కలగా ఉన్న ఈ ప్రాజెక్ట్ను తెరపైకి తీసుకురావడం గొప్ప విషయమని, భారతీయ సినీ చరిత్రలో అత్యంత వినూత్న దర్శకుల్లో ఒకరైన సింగీతం గారి లెగసీకి ‘సింగ్ గీతం’ అందమైన నివాళిగా నిలిచిందన్నారు.
సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పనితీరును కూడా ఎన్టీఆర్ ప్రశంసించారు. ఆయన అందించిన సంగీతం చిత్రంలోని భావోద్వేగాలను మరింతగా ప్రేక్షకుల హృదయాలకు చేరవేసి, కథకి ప్రత్యేక బలాన్ని ఇచ్చిందని అన్నారు.
అలాగే సినిమా ప్రమోషన్ విషయంలో మేకర్స్ అనుసరించిన వినూత్న విధానం తనను ఎంతో ఆకట్టుకుందని ఎన్టీఆర్ పేర్కొన్నారు. సినిమా విడుదలైన తర్వాత ట్రైలర్ను విడుదల చేయడం అరుదైన విషయమని, అలాంటి విభిన్న ఆలోచన సింగీతం గారి సృజనాత్మకతకు నిదర్శనమన్నారు.
ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో ప్రశంసలు దక్కడంతో ‘సింగ్ గీతం’ చిత్రానికి మరింత బలం చేకూరింది. క్రియేటివిటీ, లెగసీ, సినిమా మ్యాజిక్ ని వేడుకలా జరుపుకునే చిత్రంగా ‘సింగ్ గీతం’ తన ప్రత్యేకతను చాటుకుంది.








