శాంతి ఒప్పందం సరే.. అమెరికా-ఇరాన్ భిన్నాభిప్రాయాల సంగతేంటి?
ఇరాన్-అమెరికా ఒప్పందం కుదరడంతో ప్రపంచవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇంత సుదీర్ఘంగా జరిగిన చర్చల ప్రక్రియలో.. ఇరాన్ ఏం కోరింది.. ట్రంప్ ఏమిచ్చారు..? అన్నది ఆసక్తికర ప్రశ్నగా మారింది. అయితే.. ఇరుదేశాల మధ్య అంగీకారానికి వచ్చిన ఒప్పందంలోని వివరాలను ఇరాన్ వార్తా సంస్థ మెహ్రా న్యూస్ వెల్లడించింది. దీనిలో మొత్తం నిబంధనలు ఉన్నట్లు పేర్కొంది. విస్తృత ఒప్పందానికి ఇవే పునాదులని వెల్లడించింది.
ఒప్పందంలోని నిబంధనలను ఓ సారి పరిశీలిద్దాం..లెబనాన్ సహా ఇరాన్ మిత్రపక్షాలపై తక్షణం యుద్ధాన్ని నిలిపివేయాలి.ఇరాన్ అంతర్గత విషయాల్లో అమెరికా జోక్యం చేసుకోకూడదు. ఇరాన్ సార్వభౌమాధికారాన్ని గౌరవించాలి. అమెరికా నౌకాదళ దిగ్బంధాన్ని 30 రోజుల్లో పూర్తిగా తొలగించాలి.
ఇరాన్ చుట్టుపక్కల ప్రదేశాల నుంచి అమెరికా దళాలను పూర్తిగా వెనక్కి తీసుకొనేందుకు కట్టుబడి ఉండాలి. దీనికి గానూ హర్మూజ్ జలసంధిని 30 రోజుల్లో పూర్తిగా తెరవాలి.
ఇరాన్ పై చమురు ఆంక్షలు తొలగించడం. పెట్రోకెమికల్ ఉత్పత్తులు, డెరివేటివ్‌ల నుంచి వచ్చే ఆర్థిక లబ్ధి పూర్తిగా ఇరాన్‌కు అందేటట్లు చేయాలి.ఇరాన్ పునర్నిర్మాణం కోసం అమెరికా, దాని మిత్రదేశాలు 300 బిలియన్ డాలర్ల విలువైన ప్రణాళిక సమర్పించాలి. అణు అంశాలపై ఒప్పందానికి, అమెరికా విధించిన ప్రాథమిక, ద్వితీయశ్రేణి ఆంక్షల తొలగింపునకు, ఐక్యరాజ్యసమితి, ఐఏఈఏ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ తీర్మానాలను తొలగించేందుకు 60 రోజులపాటు చర్చలు జరపాల్సి ఉంటుంది.
ఎన్పీటీ ఒప్పందం ప్రకారం అణ్వాయుధాలు ఉత్పత్తి చేయబోమని ఇరాన్ పునరుద్ఘాటించాలి.చర్చల సమయంలో అమెరికా ఈ ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించకూడదు. అమెరికా స్తంభింపజేసిన ఇరాన్‌కు చెందిన 24 బిలియన్ డాలర్లను విడుదల చేయాలి. చర్చల ప్రారంభానికి ముందే వీటిల్లో సగం విడుదల చేయాలి.ఒప్పందం అమలుకు పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటుచేయాలి. తుది ఒప్పందాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం ద్వారా ఆమోదించాలి.








