ఇరాన్-అమెరికా మధ్య చారిత్రాత్మక డీల్.. ధృవీకరించిన టెహ్రాన్..!
మూడు నెలలకు పైగా పశ్చిమాసియాను వణికించిన ఇరాన్-అమెరికా యుద్ధానికి ఎండ్ కార్డ్ పడింది. ఇరాన్ తో శాంతి ఒప్పందంపై ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. చివరకు అనుకున్నది సాధించారు. యుద్ధం ముగిసిందని.. హర్మూజ్ తెరుచుకుంటుందన్నారు ట్రంప్. అక్కడ ఇక నుంచి టోల్ వసూళ్లు ఉండవని స్పష్టం చేశారు. అయితే.. ఈ ఒప్పందం విషయంలో అణ్వాయుధాల ఊసు లేకపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మరోవైపు.. ఇరాన్ సైతం డీల్ ను ధృవీకరించింది. ఐఆర్జీసీ దళాలకు అనుబంధంగా పనిచేసే ఐఆర్ఐబీ వార్తా సంస్థ తొలుత దీనిని ఇరాన్ విజయంగా అభివర్ణించింది. ఒప్పందానికి వచ్చే పరిస్థితి అమెరికాకు కల్పించినట్లు పేర్కొంది. ఆ తర్వాత సుప్రీం నేషనల్ కౌన్సిల్ సెక్రటేరియట్ ఈ ఒప్పందాన్ని ధ్రువీకరించింది. లెబనాన్, ఇరాన్ అనుకూల పక్షాలపై అమెరికా శాశ్వతంగా సైనిక ఆపరేషన్లను నిలిపివేయడం, ఇరాన్ రేవులపై నౌకాదళ దిగ్బంధాన్ని తక్షణం తొలగించడం వంటి వాటికి అంగీకరించినట్లు పేర్కొంది. ఈ అవగాహన ఒప్పందంపై జూన్ 19వ తేదీన సంతకాలు జరుగుతాయని ఇరాన్ విదేశాంగశాఖ ఉప మంత్రి కాజెమ్ గరీబాబడీ వెల్లడించారు. ఈ ఒప్పందం కోసం తుదివిడతగా 15 గంటలపాటు చర్చలు జరిగినట్లు వెల్లడించారు. ఇక తుది చర్చలు మాత్రం ఈ డీల్‌లోని అంశాల అమలుపై ఆధారపడి ఉంటాయని ఇరాన్ చెబుతోంది.
జూన్ 19న ఒప్పందంపై సంతకాలు జరిగిన వెంటనే హర్మూజ్ జలసంధి తెరుచుకొంటుందని ట్రంప్ పేర్కొన్నారు. చమురు రవాణ, సీమైన్స్ తొలగింపు ప్రారంభమవుతాయని వెల్లడించారు. దీంతో దాదాపు 107 రోజులపాటు మూతపడిన హర్మూజ్ మళ్లీ తెరుచుకోనుంది.
తాజాగా ఇరాన్‌తో కుదిరిన ఒప్పందం రానున్న 50 ఏళ్లలో పశ్చిమాసియా మౌలిక స్వరూపాన్నే మార్చేస్తుందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పేర్కొన్నారు. టెహ్రాన్ ఇక ఎప్పటికీ అణ్వాయుధాలు సంపాదించలేదన్నారు. కాకపోతే శుక్రవారం జరగనున్న సంతకాల కార్యక్రమానికి ఎవరు వెళ్లాలన్న అంశంపై ట్రంప్ కార్యవర్గం ఆలోచనలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ట్రంప్‌నకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న సెనెటర్ లిండ్సే గ్రాహం మాత్రం ఆచితూచి స్పందించారు. అమెరికా బృందం కంటే భిన్నంగా ఇరాన్ ఈ ఒప్పందాన్ని చూస్తుందని అభిప్రాయపడ్డారు. టెహ్రాన్ అణ్వాయుధాలను వదులుకోవడంపై సందేహాలను వ్యక్తంచేశారు.








