అమెరికాను ముప్పతిప్పలు పెట్టి ఒప్పందం చేసుకున్న ఇరాన్..!
పశ్చిమాసియాలో యుద్ధం మొదలుపెట్టింది అమెరికా. ఇజ్రాయెల్ సహకారంతో ఇరాన్ పై దాడులు చేసింది అమెరికా. ఇరాన్ సుప్రీంలీడర్ అయాతుల్లా ఖమైనీని బాంబుదాడిలో హతమార్చింది అమెరికా. అయితే అధినేత చనిపోయాడు ఇంకేముంది ఇరాన్ లొంగిపోతుందని భావించిన ట్రంప్ యంత్రాంగం పప్పులు.. ఇరాన్ ముందు ఉడకలేదు.హర్మూజ్ ఉచ్చులో అమెరికాను ఇరికించి.. అగ్రదేశంపై ఒత్తిడి పెంచింది. చమురు నడవాను బంద్ చేసి.. ట్రంప్ సర్కార్ కు ఊపిరి సలపనివ్వలేదు.ప్రపంచదేశాల నుంచి వస్తున్న ఒత్తిడి, తాము ఎంతగా దాడులు చేస్తున్నా దిగిరాని ఇరానియన్ల మొండివైఖరితో.. చివరకు అమెరికా అధ్యక్షుడే శాంతి చర్యల మంత్రాన్ని పఠించాల్సి వచ్చింది.
వారంపదిరోజులుగా ఇరాన్ తో శాంతి చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఒప్పందం కుదరబోతోందని అమెరికా అధినేత ట్రంప్.. పలుమార్లు ప్రకటనలు చేశారు.అయితే దీన్ని ఇరాన్ తోసిపుచ్చి.. మరింత దృఢంగా నిలిచింది. చర్చల ప్రక్రియలో ఎక్కడా వెనక్కి తగ్గినట్లు కనిపించలేదు. తమ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చినా.. ప్రత్యర్థి ముందు తల వంచలేదు. దీంతో అమెరికాకు మరో మార్గాంతరం లేని పరిస్థితి కల్పించిందనే చెప్పాలి.
యుద్ధం ప్రారంభించినప్పుడు ట్రంప్, నెతన్యాహు..ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని టార్గెట్ చేశారు. చివరకు ఒప్పందం కుదిరే సమయానికి దానిలో పాక్షిక నిబంధనలే ఉంచగలిగారు. ఇరాన్ తన శాంతియుత, విద్యుత్ అవసరాలకోసం అణ్వాయుధ కార్యక్రమాన్ని నిర్వహించుకునే వెసులుబాటు దక్కింది. తమ అణు రియాక్టర్లను పూర్తిగా మూసివేయకుండా, కేవలం వాటి సామర్థ్యాన్ని మాత్రమే తగ్గించడానికి ఒప్పుకుంది. “మా అణు సాంకేతికతను ప్రపంచం గుర్తించేలా చేశాం” అని ఇరాన్ చెప్పుకోవడానికి ఇది ప్రధాన కారణం.
దశాబ్దాలుగా అమెరికా, ఐక్యరాజ్యసమితి విధించిన కఠినమైన ఆర్థిక ఆంక్షల వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ఈ ఒప్పందం ద్వారా తమపై ఉన్న ప్రధాన ఆర్థిక, చమురు, మరియు బ్యాంకింగ్ ఆంక్షలను తొలగించుకోగలిగారు.విదేశీ బ్యాంకుల్లో స్తంభించిపోయిన బిలియన్ల డాలర్ల సొంత నిధులను తిరిగి సాధించుకున్నారు.దీన్ని ఇరాన్ పాలకులు అమెరికా ఆర్థిక ఒత్తిడిపై సాధించిన విజయంగా అభివర్ణించారు.
అమెరికా వంటి మహాశక్తి తమ దేశంలో పాలనను మార్చాలని (Regime Change) చూస్తోందని ఇరాన్ ఎప్పుడూ భావిస్తుంది. అయితే.. అమెరికాతో సమాన హోదాలో కూర్చుని చర్చలు జరపడం, తమ షరతులకు అమెరికాను ఒప్పించడం ద్వారా తమ జాతీయ గౌరవాన్ని, సార్వభౌమత్వాన్ని కాపాడుకున్నామని ఇరాన్ పాలకులు తమ ప్రజలకు చెప్పుకున్నారు.








