డీల్ వెరీగుడ్.. ప్రపంచదేశాల హర్షాతిరేకాలు..!
107 రోజుల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. హర్మూజ్ కంచెలు తెగాయి.. పశ్చిమాసియాలో శాంతి కపోతం ఎగురనుంది. ఎప్పుడైతే అమెరికా -ఇరాన్ మధ్య చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరిందన్న వార్త తెలిసిందో ప్రపంచదేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. మూడు నెలలకు పైగా సాగిన యుద్ధం ముగిసిపోవడంతో భారత్ సహా ప్రపంచదేశాలు హర్షం వ్యక్తంచేశాయి. ఈ ఒప్పందాన్ని (US-Iran deal) స్వాగతిస్తూ.. పశ్చిమాసియాలో సుస్థిర శాంతి నెలకొనాలని ఆకాంక్షించాయి.
‘‘అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని స్వాగతిస్తున్నాం. ఈ డీల్‌తో హర్మూజ్ జలసంధి (Strait of Hormuz:)లో ఇకపై నౌకల రవాణా నిరాటంకంగా, స్వేచ్ఛగా జరుగుతుందని ఆశిస్తున్నాం. శాంతి, ప్రాంతీయ స్థిరత్వం కోసం చేపట్టే అన్ని చర్యలకు భారత్ ఎల్లప్పుడూ మద్దతిస్తుంది. ఈ పరిణామాలను స్ఫూర్తిగా తీసుకుని ఉక్రెయిన్-రష్యా కూడా శాంతి ప్రయత్నాలు చేయాలని ఆకాంక్షిస్తున్నాం’’ అని మంత్రిత్వ శాఖల అంతర్గత సమావేశంలో భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జయస్వాల్ వెల్లడించారు.
‘‘అమెరికా-ఇరాన్ మధ్య దౌత్యపరంగా చారిత్రక డీల్ జరగడం అభినందనీయం. ఈ పరిణామాలు ప్రపంచ ఆర్థికవ్యవస్థ పునరుజ్జీవనానికి మార్గం సుగమం చేశాయి. పశ్చిమాసియా మరింత సురక్షితంగా ఉంటుంది. ఈ ఒప్పందాన్ని కృతనిశ్చయంతో అమలుచేయడం అత్యావశ్యకమన్నారు జర్మనీ ఛాన్స్లర్ ఫ్రెడ్రిక్ మెర్జ్.
‘‘ఇరాన్-అమెరికా డీల్ శుభపరిణామం. ఈ ఒప్పందాన్ని వీలైనంత వేగంగా అమల్లోకి తీసుకురావాలి. హర్మూజ్ జలసంధిని త్వరగా, భేషరతుగా తెరవాలి. ఎలాంటి ఆంక్షలు, టోల్స్ లేకుండా నౌకల రవాణాను పునరుద్ధరించాలి. అప్పుడే ప్రాంతీయ స్థిరత్వం సాధించగలం. ఇరాన్ అణు, బాలిస్టిక్ క్షిపణులకు సంబంధించిన ఆందోళనలను కూడా ఈ డీల్ పరిష్కరించాలన్నారు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్
‘‘ఇరాన్-అమెరికా ఒప్పందాన్ని స్వాగతిస్తున్నాం. అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు డీల్ కోసం మధ్యవర్తిత్వం చేసిన దేశాలకు అభినందనలు. ఇప్పుడు అందరి దృష్టి ఈ ఒప్పందం అమలుపైనే ఉంది. హర్మూజ్‌ను శాశ్వతంగా తెరవడంతో పాటు నౌకల భద్రతకు సంబంధించిన సాంకేతిక అంశాల్లో మద్దతిచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. సుస్థిరశాంతికే మా ప్రథమ ప్రాధాన్యం. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండొద్దన్న మా వైఖరి ఇప్పటికీ స్థిరంగా ఉందని స్పష్టం చేశారు యూకే ప్రధాని కీర్ స్టార్మర్.








