ఆర్థిక ఒత్తిడితో ఇరాన్ ఒప్పందానికి దిగొచ్చిందన్న ట్రంప్..!
ఇంతకూ పశ్చిమాసియా రణంతో అమెరికా ఏం సాధించింది…? దీనికి ట్రంప్ యంత్రాంగం… చాలా అంశాలను ప్రస్తావిస్తోంది. 2015 నాటి ఇరాన్ అణు ఒప్పందాన్ని (JCPOA) అమెరికా చరిత్రలోనే “అత్యంత దారుణమైన ఒప్పందం” గా అభివర్ణించారు ట్రంప్. ఆయన 2018లో ఆ ఒప్పందం నుండి ఏకపక్షంగా వైదొలిగి, ఇరాన్‌పై గరిష్ట ఒత్తిడి (Maximum Pressure) వ్యూహాన్ని అమలు చేశారు.
ట్రంప్ ఒప్పందం నుండి బయటకు వచ్చిన తర్వాత ఇరాన్‌పై చరిత్రలోనే అత్యంత కఠినమైన ఆర్థిక ఆంక్షలను మళ్లీ విధించారు.దీనివల్ల ఇరాన్ చమురు ఎగుమతులు దాదాపు సున్నాకి పడిపోయాయి.ఆ దేశ కరెన్సీ విలువ తీవ్రంగా పడిపోయి, ద్రవ్యోల్బణం (Inflation) ఆకాశాన్ని తాకింది. తమ ఆంక్షల వల్ల ఇరాన్ ఆర్థికంగా పూర్తిగా బలహీన పడిందని.. ఫలితంగా చర్చల కోసం తమ వెనకాలే ఇరాన్ ప్రతినిధులు వచ్చేలా చేయగలిగామని ట్రంప్ యంత్రాంగం చెప్పుకుంటోంది. ట్రంప్ దీనిని తన విజయంగా చెప్పుకున్నారు.
ఉగ్రవాద నిధులకు అడ్డుకట్ట వేయడం
2015 ఒప్పందం వల్ల ఇరాన్‌కు దక్కిన బిలియన్ల డాలర్ల నిధులను వారు మిడిల్ ఈస్ట్‌లోని (యెమెన్, సిరియా, లెబనాన్ వంటి దేశాలలో) తమ అనుకూల సాయుధ ముఠాలకు, ఉగ్రవాద సంస్థలకు మళ్లించారని ట్రంప్ ఆరోపించారు.తాము విధించిన కొత్త ఆంక్షల వల్ల ఇరాన్ దగ్గర డబ్బులు లేక, ఆయా ప్రాంతాల్లో ఉగ్రవాద నెట్‌వర్క్‌లకు నిధులు ఇవ్వడం చాలా కష్టంగా మారిందని ట్రంప్ వాదించారు.
బలహీనమైన ఒప్పందాన్ని బద్దలు కొట్టడం
2015 ఒప్పందంలో చాలా లోపాలు ఉన్నాయన్నది ట్రంప్ వాదన. ముఖ్యంగా ..సన్‌సెట్ క్లాజ్ (Sunset Clauses) నిబంధన ప్రకారం కొన్ని ఏళ్ల తర్వాత ఇరాన్‌పై ఉన్న అణు ఆంక్షలు ఆటోమేటిక్‌గా ముగిసిపోతాయి. అంటే ఇరాన్ శాశ్వతంగా అణుబాంబు తయారు చేయకుండా ఈ ఒప్పందం అడ్డుకోలేదు, కేవలం ఆలస్యం చేసింది మాత్రమే.ఈ ఒప్పందంలో ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల (Ballistic Missiles) తయారీపై ఎలాంటి ఆంక్షలు లేవు. ఇటువంటి చెత్త ఒప్పందం నుండి బయటకు వచ్చి, అమెరికా ప్రయోజనాలను కాపాడటమే ఒక పెద్ద విజయమని ట్రంప్ చెప్పుకున్నారు.
అబ్రహం ఒప్పందాలు (Abraham Accords)
ట్రంప్ ఇరాన్‌ను తీవ్రంగా వ్యతిరేకించడం వల్ల మిడిల్ ఈస్ట్‌లో ఒక కొత్త రాజకీయ సమీకరణం ఏర్పడింది. ఇరాన్‌ను ఉమ్మడి శత్రువుగా భావించే ఇజ్రాయెల్ మరియు అరబ్ దేశాలు (యూఏఈ, బహ్రెయిన్ వంటివి) ఒకదానికొకటి దగ్గరయ్యాయి. దీని ఫలితంగానే చారిత్రాత్మక “అబ్రహం ఒప్పందాలు” జరిగాయి. ఈ ప్రాంతీయ కూటమిని ఏర్పరచడం ఇరాన్‌పై సాధించిన దౌత్యపరమైన విజయంగా ట్రంప్ బృందం ప్రకటించుకుంది.
ఖాసిం సులేమానీ ఖతం
2020లో ఇరాన్ అత్యంత శక్తివంతమైన సైనిక కమాండర్ జనరల్ ఖాసిం సులేమానీని అమెరికా డ్రోన్ దాడి ద్వారా హతమార్చింది. అమెరికాపై దాడులకు ప్లాన్ చేస్తున్నందుకే ఆయనను చంపేశామని, ఇరాన్ దూకుడుకు గట్టి బుద్ధి చెప్పామని ట్రంప్ దీనిని ఒక భారీ విజయంగా తన ఎన్నికల ప్రచారాల్లో వాడుకున్నారు.








