అమరావతిలో వర్సిటీ క్యాంపస్ ఏర్పాటు చేయండి
నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్ ప్రతినిధులకు సీఎం చంద్రబాబు ఆహ్వానం
సీఐఐ ఏపీ బిజెనెస్ డెలిగేషన్తోనూ సీఎం భేటీ
సింగపూర్, జూన్ 15 : అమరావతిలో యూనివర్శిటీ క్యాంపస్ ఏర్పాటు చేయాలని ప్రపంచంలో మేటి యూనివర్సిటీల్లో ఒకటైన నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ (ఎన్యూఎస్)ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ప్రెసిడెంట్ టాన్ ఎంగ్ చేయ్తో సీఎం భేటీ అయ్యారు. ఏపీలో ఎన్యూఎస్ ఇంటర్నేషనల్ బ్రాంచ్, లేదంటే శాటిలైట్ క్యాంపస్ ఏర్పాటుకు ప్రతిపాదించిన ముఖ్యమంత్రి అమరావతిలో ప్రపంచ స్థాయి విద్యా సంస్థల ఏర్పాటు లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు రాజధాని ప్రాంతంలో కార్యకలాపాలు మొదలు పెట్టాయని వివరించారు. గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షించేలా సరికొత్త పాలసీల రూపకల్పనపై ఎన్యూఎస్ పాలసీ ఇనిస్టిట్యూట్ సహకారానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్లు అమరావతి నిర్మాణ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అమరావతి మాస్టర్ ప్లాన్ రూపొందించడంలో తమ భాగస్వామ్యాన్ని ప్రొఫెసర్లు గుర్తు చేసుకున్నారు. అమరావతిలో క్యాంపస్ పెట్టాలన్న ముఖ్యమంత్రి సూచనపై సానుకూలంగా స్పందించిన టాన్ ఎంగ్ చేయ్ ఈ ప్రతిపాదనను పరిశీలిస్తామన్నారు.
ఏపీలో అవకాశాలను ప్రమోట్ చేయండి
తొలిరోజు పర్యటనలో సీఐఐ ఏపీ బిజెనెస్ డెలిగేషన్తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి చెందిన పలువురు పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు ప్రపంచంలో అనేక చోట్ల కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని సీఎం ఈ సందర్భంగా అన్నారు. అన్ని రంగాల్లో తెలుగు పారిశ్రామికవేత్తలు ఉన్నారని, మారుతున్న కాలానికి అనుగుణంగా అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. టెక్నాలజీ యుగంలో కొత్త ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇంకా సీఎం మాట్లాడుతూ… ‘రాష్ట్రం తరపున, దేశం తరపున విదేశీ పర్యటనల్లో పారిశ్రామిక వేత్తలను భాగస్వాములను చేస్తాం. ఏపీలో ఉన్న అవకాశాలు విదేశాల్లో వివరించే బాధ్యతను కూడా పారిశ్రామికవేత్తలు తీసుకోవాలి. రాష్ట్రాన్ని ప్రమోట్ చేయడం అంటే… సొంత రాష్ట్రంలో అవకాశాలను సృష్టించడమే అవుతుంది. మన బలాలు వివరించి విదేశీ కంపెనీలను రాష్ట్రానికి తీసుకురావాలి. అవసరం అయితే విదేశీ కంపెనీ భాగస్వామ్యంతో పరిశ్రమలు స్థాపించాలి.

అదే విధంగా ఇతర దేశాల్లో ఉన్న టెక్నాలజీని, వ్యాపారాన్ని రాష్ట్రానికి పరిచయం చేయాలి. ఏపీలో మంచి పాలసీలు ఉన్నాయి… సహకరించే ప్రభుత్వం ఉంది. మానవ వనరులు, భూములు, నీళ్లు ఉన్నాయి. ఏ రంగంలో అయినా ఏపీలో పెట్టబడులు పెట్టవచ్చు. ఫుడ్ ప్రాసెసింగ్ నుంచి సెమీ కండక్టర్ వరకు మనం బెస్ట్ పాలసీలతో సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రంలో పారిశ్రామిక అనుకూల వాతావరణాన్ని విదేశాల్లో బ్రాండ్ చేసే బాధ్యతను తెలుగు పారిశ్రామికవేత్తలు తీసుకోవాలి.’ అని అన్నారు. ఈ పర్యటనలో భాగంగా జీఐసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సలహాదారు లిమ్ సియాంగ్ గువాన్తో ముఖ్యమంత్రి మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో పరిపాలనలో సంస్కరణల అమలు అంశాలపై చర్చించారు. గుడ్ గవర్నెన్స్ విషయంలో సీనియర్ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు శిక్షణ ఇవ్వాలని గువాన్ను సీఎం ఆహ్వానించారు. మరోవైపు సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి లోయెన్ లింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. వివిధ రంగాల్లో సింగపూర్-ఏపీ భాగస్వామ్యంపై ఇరువురు చర్చించారు.








