సాయి కృష్ణ కేసు సిబిఐకి..?
ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపిన గాదె సాయికృష్ణ అదృశ్యం, పోలీస్ కస్టడీ మరణం (లాకప్ డెత్) ఆరోపణల వ్యవహారంపై ఏపీ హైకోర్టులో కీలక విచారణ జరిగింది. ఈ కేసు దర్యాప్తును కేవలం పోలీసులకే వదిలేయకుండా.. తక్షణమే కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) కి అప్పగించాలని కోరుతూ హైకోర్టులో ఒక పిల్ (PIL) దాఖలైంది. దీనిపై న్యాయస్థానం ఇరువర్గాల వాదనలను విన్నది. హైకోర్టు విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ (AG) కీలక వివరాలను న్యాయస్థానానికి సమర్పించారు.
ఈ కేసు అత్యంత సున్నితమైనది కావడంతో పూర్తి పారదర్శకంగా దర్యాప్తు జరిపేందుకు ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేసిందని ఏజీ కోర్టుకు తెలిపారు. సిట్ అధికారులు రాత్రింబగళ్లు శ్రమించి కేసులోని లూప్‌హోల్స్‌ను ఛేదిస్తున్నారని వివరించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉంటూ, సాక్ష్యాలను రూపుమాపారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక మాజీ సర్కిల్ ఇన్స్పెక్టర్ (CI) ఎస్.ఎస్.వి.వి. నాగరాజును సిట్ బృందం ఇప్పటికే అదుపులోకి తీసుకుందని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు స్పష్టం చేశారు.
పరారీలో ఉన్న నాగరాజును అరెస్ట్ చేశామని, వైద్య పరీక్షల అనంతరం ఈరోజే (బుధవారం) ఆయన్ను విజయవాడ కోర్టు ముందు హాజరుపరుస్తున్నట్లు న్యాయస్థానానికి నివేదించారు. చట్టం ముందు ఎవరూ చుట్టాలు కారని, తప్పు చేసిన అధికారిపై కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రభుత్వం మరియు సిట్ తీసుకున్న చర్యలను, దర్యాప్తు పురోగతిని రికార్డుల్లోకి తీసుకున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. తదుపరి విచారణను జూలై 6వ తేదీకి వాయిదా వేసింది. ఈ లోగా కేసు దర్యాప్తునకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన సమగ్ర నివేదికను సమర్పించాలని సిట్ అధికారులను ఆదేశించింది. సాయికృష్ణ తల్లి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌తో పాటు ఈ పిల్ కూడా జూలై 6న విచారణకు రానుంది.








