జీటీఈఏ బోర్డు సభ్యుడిగా నరేందర్ రెడ్డి నియామకం
అమెరికాలోని జార్జియా రాష్ట్ర రవాణా వ్యవస్థను ఆధునీకరించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ‘జార్జియా ట్రాన్స్‌పోర్టేషన్ ఎఫిషియెన్సీ అథారిటీ’ (GTEA) బోర్డు సభ్యుడిగా ప్రముఖ భారతీయ అమెరికన్ పారిశ్రామికవేత్త, సామాజికవేత్త నరేందర్ రెడ్డిని జార్జియా గవర్నర్ బ్రియాన్ కెంప్ నియమించారు.
GTEA నేపథ్యం
ఏప్రిల్ 2026లో జార్జియా జనరల్ అసెంబ్లీ ఆమోదించిన చట్టం ద్వారా GTEA స్థాపించారు. ఇది అట్లాంటా-రీజియన్ ట్రాన్సిట్ లింక్ అథారిటీ (ATL), జార్జియా రీజినల్ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ (GRTA) సంస్థలను విలీనం చేసి, రవాణా ప్రణాళికను క్రమబద్ధీకరించడం, రవాణా వ్యవస్థలో సామర్థ్యాన్ని పెంచడం, సంస్థల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం దీని ముఖ్య ఉద్దేశం.
22 ఏళ్ల అనుభవం
నరేందర్ రెడ్డికి రవాణా విధానంలో 22 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. గతంలో జార్జియా రీజినల్ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ (GRTA) బోర్డులో ఆయన 22 ఏళ్ల పాటు సేవలు అందించారు. గత ముగ్గురు గవర్నర్ల (సోనీ పర్డ్యూ, నాథన్ డీల్, బ్రియాన్ కెంప్) పాలనలో ఆయన ఈ బాధ్యతలను నిర్వహించారు. నరేందర్ రెడ్డి 35 ఏళ్లుగా జార్జియాలో నివాసం ఉంటున్నారు.
ఆయన ‘స్టెర్లింగ్ రియాల్టీ సర్వీసెస్, ఇంక్.’ అనే రియల్ ఎస్టేట్ సంస్థకు ఫౌండర్‌గా, అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. గతంలో ‘క్వాంటం నేషనల్ బ్యాంక్’కు ఫౌండింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆయన యూనివర్సిటీ ఆఫ్ ఎవాన్స్‌విల్లే నుండి ఎంబీఏ (M.B.A.) పూర్తి చేశారు.








