హర్మూజ్ మాదే.. టోల్ వసూలు చేసేందుకు ఇరాన్, ఒమన్ సంయుక్త ప్లానింగ్..!
హర్మూజ్ పై టోల్ విషయంలో ఇరాన్ ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. హర్మూజ్ మార్గంలో ఫ్రీ ప్రయాణం ఉండాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఓవైపు చెబుతుంటే.. ఇరాన్ మాత్రం హర్మూజ్ తమకుదేవుడిచ్చిన వరంగా చెబుతోంది. కచ్చితంగా.. అక్కడ టోల్ వసూలు చేసి తీరతామంటోంది. ఈ పరిణామం శాంతి చర్చల్లో ఎలాంటి పరిస్థితికి దారితీస్తుందన్నది ఆందోళనకరంగా ఉంది.
హర్మూజ్ జలసంధి దేవుడు తమ దేశానికి ఇచ్చిన దివ్య బహుమానమని ఇరాన్ ప్రకటించింది. అందుకే ఆ జలసంధిని నియంత్రించి, టోల్ రుసుము వసూలు చేసుకునే హక్కు తమకుందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, శాంతి సంప్రదింపుల్లో ప్రధాన ప్రతినిధి మహమ్మద్ బాఘెర్ గలీబాఫ్ అన్నారు. దోహాలో ఇరాన్ అమెరికాల మధ్య సంప్రదింపులు ప్రారంభం కానున్న దశలో గలీబాఫ్ ఈ ప్రకటన చేయటం గమనార్హం. ‘‘ఈ యుద్ధంలో మాకు దేవుడిచ్చిన వరం హర్మూజ్ జలసంధి. ఇదో గొప్ప అధికార సాధనం. అమెరికా, ఇరాన్‌ల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంలో హర్మూజ్‌లో నిరంతరం ఉచిత నౌకాయానానికి వీలు కల్పించాలన్న నిబంధనేదీ లేదు’’ అని ఆయన అన్నారు.
అణు కార్యక్రమానికి సంబంధించి తమ హక్కుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఇరాన్ ప్రతినిధి గలీబాఫ్ మరోసారి స్పష్టం చేశారు. అమెరికాతో కుదిరిన 14 అంశాల అవగాహన ఒప్పందం (ఎంఓయూ)లో పేర్కొన్న కీలక హామీలు పూర్తిగా అమలైన తర్వాతే తదుపరి దశ చర్చలకు వెళ్తామన్నారు. అలాగే ఈ ఒప్పందాన్ని అమలు కాకుండా అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆరోపించారు
ఇవి కూడా చదవండి
గతంలో పర్షియన్ గల్ఫ్ నుంచి అంతర్జాతీయ మార్కెట్లకు చమురు, గ్యాస్ సరఫరా చేసే వాణిజ్య నౌకలు ఈ రెండు తీరప్రాంత దేశాల మధ్య ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా ప్రయాణించేవి. ఒకవేళ ఇప్పుడు ఇరాన్, ఒమన్‌లు టోల్ వసూలు చేయడానికి సిద్ధపడితే, ఈ రవాణా నౌకలు కచ్చితంగా రుసుములు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
అమెరికా, ఇజ్రాయెల్‌లు ఇరాన్‌పై దాడి చేయడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చెలరేగాయి. దీనితో ఇరాన్ హర్మూజ్ జలసంధిని దిగ్బంధించింది. దీనితో వాణిజ్య నౌకల రాకపోకలు ఆగిపోయి, ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు భారీగా పెరిగిపోయాయి. చివరికి అమెరికా, ఇరాన్ మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందం కుదిరి, ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కపడుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఈ వ్యూహాత్మక సముద్ర మార్గాన్ని వాణిజ్యపరంగా వాడుకొని ఆదాయం సంపాదించాలనే ఉద్దేశాన్ని ఇరాన్ అధికారులు నిరంతరం వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
సర్వీస్ ఫీజు వసూలుకు ఒమన్ సిద్ధం!
నివేదికల ప్రకారం, సముద్ర రవాణా సంస్థలు హర్మూజ్ జలసంధిని దాటడానికి తమకు సేవా రుసుములు (సర్వీస్ ఫీజు) చెల్లించేలా ఒమన్ కొన్ని అధికారిక ప్రతిపాదనలు చేసింది. వాటిని ఇప్పటికే అమెరికా సహా ఇతర పాశ్చాత్య మిత్రదేశాలకు నివేదించింది. యూఎస్ ప్రతినిధులు ఒమన్ ప్రతిపాదనల పత్రాన్ని అందుకున్నారని చెప్పారు. దీనిపై తమకున్న ఆందోళనలను ఒమన్ అధికారులతో చర్చిస్తున్నారని పేర్కొన్నారు. అయితే ఈ పత్రంలో పేర్కొన్నవి ‘తప్పనిసరి సుంకాలు’ (Mandatory Tolls) కాదని, కేవలం ‘స్వచ్ఛంద సేవా రుసుములు’ (వాలంటరీ సర్వీస్ ఫీజులు) మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. ఒమన్ రూపొందించిన ఈ రుసుముల విధానం మలక్కా, సింగపూర్ జలసంధుల్లో అమల్లో ఉన్న విధివిధానాల ఆధారంగా రూపొందించారు అని పేర్కొన్నారు. దీని ప్రతిపాదనల ప్రకారం, ఒమన్ తీరప్రాంతంలోని ఒక ప్రైవేటు ఫౌండేషన్ సముద్ర భద్రతా చర్యల కోసం ఈ వాణిజ్య నౌకల నుంచి స్వచ్ఛంద విరాళాలు సేకరిస్తుందని ఆయన తెలిపారు.
టోల్ ట్యాక్స్ కట్టాల్సిందే: ఇరాన్
అయితే ఓ ఇరాన్ అధికారి మాత్రం హర్మూజ్ జలసంధి గుండా రవాణా నౌకలు వెళ్లాలంటే టోల్ ట్యాక్స్ కట్టితీరాల్సిందేనని పేర్కొన్నారు. సముద్ర రవాణా మార్గాన్ని ఉమ్మడిగా నిర్వహించేందుకు ఒమన్‌తో ఒప్పందం కుదుర్చుకోవడమే ప్రస్తుతం తమ ప్రధాన లక్ష్యమని ఇరాన్ ఉపవిదేశాంగ మంత్రి కాజెం ఘరీబాబాది తెలిపారు. ఒకవేళ ఒమన్ ఈ ద్వైపాక్షిక ఒప్పందాన్ని అంగీకరించకపోతే, ఇరాన్ ఒంటరిగానే ఈ ప్రక్రియతో ముందుకు వెళ్తుందని ఘరీబాబాది తెలిపారు.








