AI Impact: ఉద్యోగాలకే కాదు.. సీఈఓల పదవులకూ ‘ఏఐ’ సెగ!
AI Impact: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాకతో కేవలం కింది స్థాయి ఉద్యోగులకే కాదు, అగ్రశ్రేణి సంస్థల సీఈఓలకు కూడా ముప్పు తప్పడం లేదు. తాజాగా ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు కోకాకోలా, వాల్మార్ట్ అధినేతలు చేసిన వ్యాఖ్యలు టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్నాయి. కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో యువతకే ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తూ తాము పదవుల నుంచి తప్పుకుంటున్నట్లు వారు ప్రకటించారు.
యువ నాయకత్వానికే మొగ్గు:
కోకాకోలా సీఈఓగా 2017 నుంచి కొనసాగుతున్న జేమ్స్ క్విన్సీ, ఈ నెలాఖరున తన పదవికి స్వస్తి పలకనున్నారు. ఏఐ యుగంలో సంస్థను ముందుకు నడపాలంటే నూతన శకానికి నాంది పలకాలని, అందుకు యువ నాయకత్వం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. సాంకేతిక మార్పులకు అనుగుణంగా కొత్త తరం నాయకులు బాధ్యతలు చేపట్టడమే సరైన నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. క్విన్సీ స్థానంలో హెన్రిక్ బ్రాన్ కొత్త బాధ్యతలు తీసుకోనున్నారు.
సుదీర్ఘ కాలం పోటీ పడలేం:
వాల్మార్ట్ మాజీ సీఈఓ డగ్ మెక్ మిల్లన్ సైతం ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏఐ వల్ల వ్యాపార రంగంలో వచ్చే మార్పులను స్వీకరించినప్పటికీ, వాటితో సుదీర్ఘకాలం పోటీ పడటం తన వల్ల కాదని ఆయన నిజాయితీగా ఒప్పుకున్నారు. అందుకే జనవరిలోనే తాను బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో వాణిజ్య రంగంలో ఏఐ పాత్ర మరింత కీలకమని ఆయన జోస్యం చెప్పారు.
వైట్ కాలర్ ఉద్యోగాలకూ గండం:
మరోవైపు, రాబోయే ఐదేళ్లలో అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్, లీగల్ వంటి రంగాల్లో పనిచేసే వైట్ కాలర్ ఉద్యోగుల్లో సగం మందిని ఏఐ భర్తీ చేసే అవకాశం ఉందని ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్ హెచ్చరించారు. కేవలం ఎంట్రీ లెవల్ మాత్రమే కాకుండా, అన్ని విభాగాల్లోనూ ఏఐ కారణంగా కోతలు తప్పవని ఆయన విశ్లేషించారు.








