Second Brain: ఇది సైన్స్ ఫిక్షన్ కాదు… మన కళ్ల ముందే నిజమవుతున్న భవిష్యత్తు!
—సూర్య ప్రకాష్ జోశ్యుల
2034.
ప్రపంచంలోనే అతిపెద్ద కోర్టులో… ఒక విచిత్రమైన కేసు నడుస్తోంది.
నిందితుడు…ఒక మనిషి కాదు.
ఒక AI.
న్యాయమూర్తి ఒక్క ప్రశ్న అడిగాడు.
“నువ్వు చెప్పింది అంతా నిజమేనని ఎలా నిరూపిస్తావు?”
AI ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
నిశ్శబ్దంగా…
ఒక ఫోల్డర్ తెరిచింది.
అందులో…
పది సంవత్సరాల క్రితం రాసిన ఒక నోట్.
ఏడేళ్ల క్రితం జరిగిన ఒక మీటింగ్.
మూడేళ్ల క్రితం తీసుకున్న ఒక నిర్ణయం.
నిన్న రాత్రి రాసుకున్న ఒక ఆలోచన.
అన్నీ ఉన్నాయి.
చివరికి…
ఆ మనిషి తలదించుకుని ఒక్క మాట అన్నాడు.
“అది నా జ్ఞాపకం కాదు…”
“అవును అది నా జీవితమే.”
…
ఇది సైన్స్ ఫిక్షన్ కథ అనిపిస్తోందా?
బహుశా…కాకపోవచ్చు… ఎందుకంటే… ఆ భవిష్యత్తు ఇప్పటికే మొదలైంది.
కాకపోతే…
కోర్టులో కాదు. నిశ్శబ్దంగా… మన కంప్యూటర్లలో. మన ఫోన్లలో. మన నోట్స్‌లో. ఇప్పటి వరకు…జ్ఞాపకం అంటే మెదడులో ఉండేదే అనుకున్నాం. కానీ…
ఒక జ్ఞాపకం నిజంగా ఎక్కడ ఉంటుంది?
మెదడులోనా?
ఒక పాత డైరీలోనా?
ఫొటో ఆల్బమ్లోనా?
లేక…
ఏళ్ల క్రితం మనమే రాసుకున్న ఒక చిన్న నోట్లోనా?
ఒకసారి ఊహించండి.
2021లో…
మీకు ఒక గొప్ప బిజినెస్ ఐడియా వచ్చింది. రెండు పేరాలు రాశారు. ల్యాప్‌టాప్‌లో సేవ్ చేశారు. ఆ తర్వాత…
జీవితం ముందుకు వెళ్లిపోయింది. నాలుగేళ్ల తర్వాత… అదే ఆలోచనతో ఇంకెవరో కోట్ల రూపాయల కంపెనీ నిర్మించారు.
అప్పుడు మీకు ఒక్కసారిగా గుర్తొచ్చింది.
“అరే…ఎప్పుడో ఈ ఆలోచన నాకు కూడా వచ్చింది…”
కానీ…
మీ ఇంట్లో వాళ్ల దగ్గర, మీ స్నేహితుల దగ్గర కూడా నిరూపించలేరు. ఎందుకంటే… మీ మెదడు మర్చిపోయింది. మీ నోట్ మాత్రం కాదు. అక్కడే… ఒక ప్రశ్న పుట్టింది.
మనిషి మర్చిపోయినదాన్ని… ఒక యంత్రం గుర్తుంచుకోగలదా?
గుర్తుంచుకోగలదు. కానీ…మరో ప్రశ్న ఇంకా పెద్దది. అది ఎవరి జీవితాన్ని గుర్తుంచుకుంటుంది ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన AIలను చూడండి. వాటికి… చరిత్ర తెలుసు.శాస్త్రం తెలుసు. వ్యాపారం తెలుసు. కోడ్ రాయడం తెలుసు. కవిత్వం రాయడం తెలుసు.
కానీ…
మీ గురించి ఏమీ తెలియదు. మీ మొదటి ఉద్యోగం.మీ ప్రేమ..మీ మొదటి ఓటమి. మీ మొదటి బిజినెస్ ఐడియా. మీ మీటింగ్ నోట్స్. మీ కలలు. మీ తప్పులు. ఏమీ తెలియదు.
అవి…
ప్రపంచాన్ని చదివాయి. మీ జీవితాన్ని కాదు. అందుకే…ప్రపంచం మరో ప్రశ్న అడిగింది.
“AIకి ప్రపంచాన్ని నేర్పాం…”
“ఇప్పుడు నా జీవితాన్ని కూడా నేర్పితే?”
ఆ ప్రశ్నకు సమాధానం వెతుకుతూనే…
ఒక కొత్త ఆలోచన పుట్టింది.
దానికి పెట్టిన పేరు…
Second Brain.
Second Brain…
అంటే మరో మెదడు కాదు. మీ జీవితానికి… ఒక రెండో జ్ఞాపకశక్తి. మీరు రాసుకున్న ప్రతి ఆలోచన… ప్రతి నిర్ణయం… ప్రతి మీటింగ్… ప్రతి పుస్తక నోట్… కాలంతో మాయమవకుండా… ఒకదానితో ఒకటి మాట్లాడేలా ఉండే ప్రపంచం. కానీ… ఆ ప్రపంచానికి ఒక ఇల్లు కావాలి.
ప్రస్తుతం…
ఆ ఆలోచనకు కేంద్రంగా మారిన పేరు…
Obsidian.
పై నుంచి చూస్తే… ఇది ఒక సాధారణ నోట్ యాప్‌లా కనిపిస్తుంది. కానీ… కొన్ని రోజులు వాడాక అర్థమవుతుంది. ఇది నోట్స్ నిల్వ చేసే యాప్ కాదు. ఆలోచనలను కలిపే వ్యవస్థ. ప్రతి నోట్… ఒక ఫైల్ కాదు.
ఒక జ్ఞాపకం.
ప్రతి లింక్…
ఒక కనెక్షన్ కాదు.
ఒక ఆలోచనకు మరో ఆలోచన దొరికిన క్షణం.
కొన్ని నెలల తర్వాత… కొన్ని సంవత్సరాల తర్వాత… మీరు ఒక ప్రశ్న అడిగితే… AI… మీ నోట్స్ చదవదు. మీ ఆలోచనల మధ్య సంబంధాలను చదువుతుంది. అందుకే ఇప్పుడు మీరు ఇలా అడగగలుగుతున్నారు.
“2024లో AI గురించి నేను ఏమేం రాశాను?”
“నేను పదే పదే చేస్తున్న తప్పు ఏమిటి?”
“వదిలేసిన నా బెస్ట్ స్టార్టప్ ఐడియా ఏది?”
“ఆ సినిమా గురించి నా అభిప్రాయం ఎప్పుడు మారింది?”
ఇవి…
ఇంటర్నెట్ను అడిగే ప్రశ్నలు కావు. మనల్ని మనమే అడిగే ప్రశ్నలు.
ఇది విద్యార్థికి ఉపయోగపడుతుంది.
రచయితకు ఉపయోగపడుతుంది.
జర్నలిస్టుకు ఉపయోగపడుతుంది.
యూట్యూబర్‌కు ఉపయోగపడుతుంది.
వ్యాపారవేత్తకు ఉపయోగపడుతుంది.
ఒక్క మాటలో చెప్పాలంటే…
“ఎక్కడో రాసుకున్నాను…” అనే మాట తరచూ చెప్పేవారికి ఉపయోగపడుతుంది. ఇందులో ఇంకో ఆసక్తికరమైన విషయం ఉంది. చాలా AI సేవల్లో… మీ సమాచారం వాళ్ల సర్వర్లలో ఉంటుంది. కానీ…Obsidianలో… మీ నోట్స్ మీ కంప్యూటర్లోనే ఉండేలా ఉపయోగించవచ్చు.
అంటే…
మీ జీవితానికి యజమాని… ఇంకా మీరే. AI… కేవలం అతిథి మాత్రమే.
అలాగే..
మొదటగా చెప్పిన 2034లో ఆ కోర్టు మేటర్ ఎప్పుడూ జరగకపోవచ్చు. కానీ… ఒక రోజు… ఎవరైనా మిమ్మల్ని ఇలా అడగొచ్చు.
“మీరు నిజంగా అలా అనుకున్నారని ఎలా నిరూపిస్తారు?”
ఆ రోజు…
మీరు జ్ఞాపకాలను వెతకరు. ఒక ఫోల్డర్ తెరుస్తారు.
అందులో…
పదేళ్ల క్రితం…
మీరు రాసుకున్న ఒక వాక్యం ఉంటుంది.
అప్పుడు మీకు అర్థమవుతుంది.
ఆ కథలో నిందితుడు AI కాదు.
మనిషి కూడా కాదు.
కాలం.
ఎందుకంటే…
జ్ఞాపకాలను దొంగిలించేది ఎప్పుడూ కాలమే.
AI కాదు.
బహుశా…
అందుకే మనిషి మొదటిసారి…
కాలంతో పోరాడేందుకు ఒక కొత్త ఆయుధాన్ని కనిపెట్టాడు.
దాని పేరు…
Second Brain.








