టెస్టోస్టెరాన్ బూస్టర్ శిలాజిత్… వెనుక దాగిన చీకటి నిజం!
–సూర్య ప్రకాష్ జోశ్యుల
కింద…
వేల అడుగుల లోయ.
పైన…
మంచుతో కప్పుకున్న హిమాలయాలు.
మధ్యలో…
ఒక మనిషి.
రాతికి వేలాడుతూ…
చిన్న కత్తితో నల్లటి జిగురును గీరుతున్నాడు.
అది బంగారం కాదు.
వజ్రం కాదు.
చమురు కాదు.
అయినా… దాని కోసం మనుషులు ప్రాణాలనే పణంగా పెడుతున్నారు. కొన్ని చోట్ల తుపాకులతో రాళ్లను కాలుస్తారు. మరికొన్ని చోట్ల డైనమైట్‌తో పేలుస్తారు.
ఒక్క చిన్న ముక్క కోసం.
ఆ నల్లటి పదార్థం పేరు…
శిలాజిత్.
ప్రపంచం ఇప్పుడు దాన్ని…
‘టెస్టోస్టెరాన్ బూస్టర్’ అంటూ కొనేస్తోంది.
కానీ… ఇంత ప్రాణాలకు తెగించి సేకరించే శిలాజిత్… ప్రపంచవ్యాప్తంగా లక్షల బాటిళ్లలో ఎలా అమ్ముడవుతోంది?
అసలు అవన్నీ హిమాలయాల నుంచే వస్తున్నాయా? లేక… శిలాజిత్ వెనుక ఇంకా ప్రపంచానికి తెలియని చీకటి నిజం ఏదైనా దాగి ఉందా?
అవును…
మీ జిమ్‌లో…
మీ మొబైల్లో…
Instagram Reelsలో…
“Natural Testosterone Booster” అంటూ వైరల్ అవుతున్న శిలాజిత్ ఇదే..
అయితే ఈ కథ శిలాజిత్ గురించి కాదు. ప్రపంచం మొత్తం కొంటున్న శిలాజిత్‌లో… అసలు హిమాలయాల నుంచి వచ్చేది ఎంత? మనం మందుగా తీసుకుంటోంది నిజంగా శిలాజితేనా? ఇదే ఇప్పుడు ప్రపంచాన్ని కలవరపెడుతున్న ప్రశ్న.
హిమాలయాల్లో మొదలైన కథ… అమెరికాలో బిలియన్ డాలర్ల మార్కెట్!
శిలాజిత్ అనేది సాధారణ ఔషధం కాదు. వేల ఏళ్లుగా ఆయుర్వేదం, టిబెటన్ వైద్యంలో దీనిని ఉపయోగిస్తున్నారు. ఎముకల సమస్యల నుంచి… లైంగిక శక్తి పెంపు వరకు… అనేక ప్రయోజనాలు ఉన్నాయని నమ్మకం. ఇటీవల కొన్ని పరిశోధనలు కూడా ఇందులో ఉండే ఫుల్విక్ యాసిడ్ ఆరోగ్యానికి ఉపయోగపడే అవకాశాలున్నాయని సూచిస్తున్నాయి.
అంతే…
సోషల్ మీడియా దాన్ని మరో లెవల్‌కు తీసుకెళ్లింది.
“Natural Testosterone Booster”
“Nature’s Steroid”
“Men’s Superfood”
అంటూ కోట్ల మంది ముందుకు తీసుకొచ్చింది. దాంతో ఇప్పుడా మందు కోసం చాలా మంది ఎగబడుతున్నారు. అంత శిలాజిత్ మరి దొరుకుతోందా?
హిమాలయాల్లో వినిపిస్తున్న మాట ఒక్కటే!
“శిలాజిత్ అయిపోతోంది…”
ఒకప్పుడు కొండ అంచులకే దొరికేదట.
ఇప్పుడు?
16 వేల అడుగుల ఎత్తు ఎక్కాలి. రోజుల తరబడి నడవాలి. ప్రాణాలను పణంగా పెట్టాలి. అప్పుడే కొద్ది గ్రాములు దొరుకుతున్నాయి. గన్‌తో కాల్చి… డైనమైట్‌తో పేల్చి… శిలాజిత్ సేకరణ చేస్తున్నారు! ఇది సినిమా సీన్ కాదు. నిజం. హిమాలయాల్లో కొన్ని చోట్ల శిలాజిత్ రాళ్లకు బలంగా అతుక్కుపోతుంది.
చేతికి అందదు. అప్పుడు… తాళ్లు కడతారు. కొండలపై వేలాడతారు. కొన్ని ప్రాంతాల్లో తుపాకులతో కాల్చి కిందకు పడేస్తారు. మరికొన్ని చోట్ల డైనమైట్ కూడా వాడుతున్నారని స్థానికులు చెబుతున్నారు.ఒక్క చిన్న ముక్క కోసం… ప్రాణాలు పణంగా పెడుతున్నారు.
అసలు ట్విస్ట్ ఇక్కడే…
హిమాలయాల్లో దొరకడం కష్టమైపోతే… ప్రపంచవ్యాప్తంగా అమ్ముతున్న వేల టన్నుల శిలాజిత్ ఎక్కడి నుంచి వస్తోంది? ఇదే పెద్ద సందేహం.
స్థానిక సేకరణదారులే ఒక మాట చెబుతున్నారు.
“మార్కెట్లో అమ్ముతున్నంత శిలాజిత్… హిమాలయాల్లో అసలు లేనే లేదు.”
అయితే…
మిగతాది?
మార్కెట్లో నకిలీల మయం?
ఇదే అత్యంత భయంకరమైన విషయం. తక్కువ ధరకు అమ్ముతున్న కొన్ని ఉత్పత్తుల్లో…
తారు (Tar)
ఆస్ఫాల్ట్
బొగ్గు
ఎరువులు
వంటి పదార్థాలు కలుపుతున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అంతే కాదు… రాళ్లలో ఉండే ఆర్సెనిక్, థాలియం వంటి ప్రమాదకర లోహాలు కూడా కొన్ని ఉత్పత్తుల్లో గుర్తించిన సందర్భాలు ఉన్నాయి.
అంటే… “Natural” అని రాసి ఉంటే… అది పూర్తిగా సురక్షితమనే అర్థం కాదు.
ఆన్ లైన్ లో కనిపించిందంటే… కొనచ్చా?
ఈ రోజుల్లో ఒక క్లిక్‌తో…
వందల బ్రాండ్లు.
వందల ఆఫర్లు.
“100% Himalayan”
“Pure Resin”
“Original”
అనే లేబుళ్లు. కానీ… అవి నిజంగా హిమాలయాల నుంచే వచ్చాయని నిరూపించడం అంత తేలిక కాదు. అందుకే నిపుణులు… ల్యాబ్ టెస్టింగ్ చేసిన… నాణ్యత ధృవీకరణ ఉన్న… విశ్వసనీయ సంస్థల ఉత్పత్తులనే ఎంచుకోవాలని సూచిస్తున్నారు.
మరి శిలాజిత్ ప్రయోజనాలు మోసమేనా?
అసలు కాదు. కొన్ని పరిశోధనలు దీని వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలును సూచిస్తున్నాయి. కానీ…సమస్య శిలాజిత్‌లో లేదు. సమస్య మార్కెట్లో ఉంది. డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో… నకిలీ ఉత్పత్తులు కూడా అదే వేగంతో పెరిగిపోయాయి.
చివరగా…
హిమాలయాల్లో…
ఆ మనిషి ఇంకా తాడుకు వేలాడుతున్నాడు.
ప్రాణాలను పణంగా పెట్టి…
రాతి చీలికల నుంచి శిలాజిత్ తీస్తున్నాడు.
వేల కిలోమీటర్ల దూరంలో…
మరో మనిషి…
మొబైల్లో “Buy Now” నొక్కి…
“100% Himalayan Shilajit” ఆర్డర్ చేస్తున్నాడు.
ఈ ఇద్దరి మధ్య…
ఎన్ని చేతులు మారిందో…
ఎంత కల్తీ కలిసిందో…
ఎవరికీ తెలియదు.
అదే…
శిలాజిత్ వెనుక ఉన్న అసలు చీకటి నిజం.








