బంకింపూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి ప్రశాంత్ కిశోర్
వ్యూహకర్తగా సుపరిచితులైన ప్రశాంత్ కిశోర్ (పీకే) అసెంబ్లీ ఉప ఎన్నికల బరిలో దిగుతున్నారు. జన సురాజ్ పార్టీ పక్షాన ఉప ఎన్నిక సందర్భంగా ఎమ్మెల్యేగా బరిలో నిలవనున్నారు. ఈ విషయాన్ని జన సురాజ్ పార్టీ ప్రకటించింది. చాలా సంవత్సరాల వరకూ పీకే పలు పార్టీలకు వ్యూహకర్తగా వ్యవహరిస్తూ, సలహాలిస్తూ వచ్చారు. ఇప్పుడు స్వయంగా ఆయనే ఎన్నికల గోదాలోకి దిగుతున్నారు.ఈ విషయాన్ని అధికారికంగా జన సురాజ్ పార్టీ అధ్యక్షుడు మనోజ్ భారతీ ప్రకటించారు.
నిజానికి చాలా సంవత్సరాలు ప్రశాంత్ కిశోర్ చాలా పార్టీలకు వ్యూహకర్తగా వ్యవహరించారు. అనేక ప్రభుత్వాలను అధికారంలోకి తెచ్చారు. ఆ తర్వాత ఐ పాక్ నుంచి వైదొలిగారు. ఆ తర్వాత పార్టీని స్థాపించారు.
అయితే.. బిహార్ లోని బంకిపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నిజానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ది. కానీ… ఆయన బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజీనామా చేశారు. దీంతో అక్కడ ఉప ఎన్నికలు వచ్చాయి. దీనిపై పీకే కొన్ని రోజుల క్రితం మాట్లాడుతూ ‘‘నా పోటీ వల్ల బీజేపీకి బలమైన కోటగా వున్న బంకిపూర్ లో పార్టీని ఓడించే అవకాశం వుంటే నేను ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధం’’ అని ప్రకటించారు.
2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ 243 స్థానాలకు గాను 238 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. కానీ ప్రశాంత్ కిశోర్ మాత్రం పోటీ చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయాలన్న ఉద్దేశంతోనే తాను ఎన్నికలకు దూరంగా వున్నానని ప్రకటించారు. అయితే.. ఎన్నికల్లో ఈ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది.








