తెలియక తింటే ప్రమాదమే.. ఫుడ్ పాయిజనింగ్ ముప్పు ఎక్కువగా ఉండే ఆహారాలు ఇవే..
ఫుడ్ పాయిజనింగ్ (Food Poisoning) అనేది కలుషితమైన ఆహారం లేదా బ్యాక్టీరియా (Bacteria), వైరస్లు (Viruses), పరాన్నజీవులు (Parasites) ఉన్న ఆహారం తినడం వల్ల వచ్చే సాధారణ ఆరోగ్య సమస్య. ముఖ్యంగా వేసవి, వర్షాకాలంలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. వికారం, వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపించవచ్చు. కొన్ని ఆహార పదార్థాలను సరిగా నిల్వ చేయకపోవడం లేదా పూర్తిగా ఉడికించకుండా తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం పెరుగుతుంది. అలాంటి ఆహారాల గురించి తెలుసుకుందాం.
చికెన్, గుడ్ల విషయంలో జాగ్రత్త

పచ్చిగా లేదా సరిగా ఉడకని చికెన్ (Chicken) ఫుడ్ పాయిజనింగ్‌కు ప్రధాన కారణాల్లో ఒకటి. ఇందులో సాల్మొనెల్లా (Salmonella), క్యాంపిలోబాక్టర్ (Campylobacter) వంటి బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి చికెన్‌ను పూర్తిగా ఉడికించి మాత్రమే తినాలి. గుడ్లు (Eggs) కూడా సరిగా ఉడకకపోతే సమస్యలకు దారితీయవచ్చు. పచ్చి గుడ్లు లేదా సగం మాత్రమే ఉడికించిన గుడ్లలో హానికరమైన సూక్ష్మజీవులు ఉండే అవకాశం ఉంటుంది.
సీఫుడ్, పాల ఉత్పత్తుల నిల్వ కీలకం

సీఫుడ్ (Seafood) ముఖ్యంగా చేపలు, రొయ్యలు, పీతలు తాజాగా లేకపోతే లేదా సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయకపోతే త్వరగా పాడవుతాయి. దీంతో ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం పెరుగుతుంది.
పాలు (Milk) ,పాల ఉత్పత్తులు (Dairy Products) సరైన విధంగా నిల్వ చేయకపోతే బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది. గడువు ముగిసిన పాలు, పెరుగు, పనీర్ వంటి పదార్థాలను తీసుకోవడం మంచిది కాదు. ఆకుకూరలు, సలాడ్లు (Leafy Greens and Salads) బాగా కడగకుండా తింటే వాటిపై ఉండే సూక్ష్మక్రిములు శరీరంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. అందుకే వీటిని శుభ్రమైన నీటితో బాగా కడిగి మాత్రమే ఉపయోగించాలి.
స్ట్రీట్ ఫుడ్, వండిన అన్నంతో ప్రమాదం

స్ట్రీట్ ఫుడ్ (Street Food).. అదేనండి ఎక్కువసేపు బయట ఉంచిన పదార్థాలతో తయారైన ఆహారాన్ని తీసుకుంటే ఫుడ్ పాయిజనింగ్ వచ్చే ప్రమాదం ఉంటుంది. పరిశుభ్రత పాటించే చోట్ల మాత్రమే ఆహారం తీసుకోవడం మంచిది.
వండిన అన్నం (Cooked Rice) కూడా ఎక్కువసేపు గది ఉష్ణోగ్రతలో ఉంచితే బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. వండిన తర్వాత వీలైనంత త్వరగా తినడం లేదా ఫ్రిజ్‌లో నిల్వ చేయడం మంచిది. మొలకెత్తిన గింజలు (Sprouts) ఆరోగ్యకరమైనవే అయినప్పటికీ, సరైన పరిశుభ్రత లేకుండా తయారైతే సూక్ష్మజీవులు పెరిగే అవకాశం ఉంటుంది. శుభ్రంగా తయారైనవే తీసుకోవాలి.
ఫుడ్ పాయిజనింగ్‌ను ఎలా నివారించాలి?

ఫుడ్ పాయిజనింగ్‌ను నివారించాలంటే ఆహారాన్ని తాజాగా వండుకుని తినడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, పచ్చి , వండిన ఆహారాన్ని వేర్వేరుగా ఉంచడం, గడువు ముగిసిన ఆహార పదార్థాలను ఉపయోగించకపోవడం చాలా ముఖ్యం. ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలు తీవ్రంగా ఉంటే లేదా ఎక్కువసేపు కొనసాగితే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.








