రేపు మీ ఉద్యోగంలో మీరు ఉంటారా? AI ఉంటుందా? మైక్రోసాఫ్ట్ లేఆఫ్స్ వెనుక షాకింగ్ నిజం!
—సూర్య ప్రకాష్ జోశ్యుల
AI ఒక్కరోజులో మీ ఉద్యోగాన్ని తీసుకోదు.
ముందు…
మీ పనిలో సగం చేస్తుంది.
తర్వాత…
మీ కంటే వేగంగా చేస్తుంది.
ఎప్పుడూ అలసిపోదు.
ఎప్పుడూ జీతం పెంచమని అడగదు.
ఆ తర్వాత…
మీరు లేకుండానే చేస్తుంది.
ఒకరోజు…
మీరు ఆఫీసుకు వెళ్తే…
మీ ఉద్యోగమే అక్కడ ఉండదు.
ఇది సైన్స్ ఫిక్షన్ కథ కాదు.
ఇది AI గురించి గత రెండేళ్లుగా ప్రపంచం వింటున్న అతిపెద్ద హెచ్చరిక. చాలామంది నమ్మలేదు. “మనిషిని AI పూర్తిగా భర్తీ చేయదు…” అన్నారు.
కానీ… ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ కంపెనీల్లో ఒకటైన Microsoft వేలాది ఉద్యోగాలను తొలగిస్తోంది. అదే సమయంలో… AI కోసం బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెడుతోంది.
ఈ రెండు వార్తలు ఒకే సమయంలో రావడం…
ప్రపంచం ముందు ఒక ఆసక్తికరమైన, అసౌకర్యమైన ప్రశ్నను నిలబెడుతోంది.
AI కొత్త ఉద్యోగాలను సృష్టిస్తోందా?
లేక… పాత ఉద్యోగాలనే నిశ్శబ్దంగా చెరిపేస్తోందా?
ఎక్స్‌బాక్స్ (Xbox) లో ఏం జరుగుతోంది?
Microsoft తన గేమింగ్ విభాగమైన Xboxలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. వచ్చే ఏడాదిలో సుమారు 3,200 మంది ఉద్యోగులను, అంటే Xbox ఉద్యోగుల్లో దాదాపు 20 శాతం మందిని తొలగించనున్నట్లు ప్రకటించింది. అదే రోజున Microsoft ఇతర విభాగాల్లో కూడా మరో 3,200 ఉద్యోగాలను తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. మొత్తం మీద ఒకే విడతలో 6,400 ఉద్యోగాలు కోతకు గురికానున్నాయి.
ఇది సాధారణ లేఆఫ్ కాదు.
ఇది ఒక సంస్థ తన భవిష్యత్తును పూర్తిగా మళ్లీ రాసుకునే ప్రయత్నం. ఒకప్పుడు ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసిన కొనుగోలు…అని చెప్పాలి.
₹5.7 లక్షల కోట్ల డీల్.. కట్ చేస్తే షాకింగ్ నష్టాలు!
2023లో Microsoft దాదాపు 69 బిలియన్ డాలర్లకు (మన దేశీ కరెన్సీలో దాదాపు ₹5.7 లక్షల కోట్లు) Activision Blizzardను కొనుగోలు చేసింది. గేమింగ్ చరిత్రలోనే అతిపెద్ద డీల్‌గా నిలిచిన ఈ నిర్ణయంతో Xbox మార్కెట్‌ను శాసిస్తుందని చాలామంది భావించారు. కానీ… అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. Xbox కన్సోల్ అమ్మకాలు తగ్గాయి. Game Pass సబ్స్క్రిప్షన్ వృద్ధి నిలిచిపోయింది.
కొత్త బ్లాక్‌బస్టర్ గేమ్స్ కూడా ఆశించిన స్థాయిలో రాలేదు.
Microsoft CEO ఒప్పుకున్న కఠిన నిజం
Xbox CEO ఆశా శర్మ ఉద్యోగులకు పంపిన లేఖలో ఒక షాకింగ్ వ్యాఖ్య చేశారు. “ఈరోజు Xbox వ్యాపారం సరిగ్గా లేదు. దాన్ని పూర్తిగా రీసెట్ చేయాల్సిన అవసరం ఉంది.” ఆమె మరో విషయాన్ని కూడా వెల్లడించారు. Xboxలో పెట్టిన ప్రతి డాలర్‌కు సరిపడా లాభం రావడం లేదని, సంస్థ మరింత క్రమశిక్షణతో పెట్టుబడులు పెట్టాల్సిన సమయం వచ్చిందని చెప్పారు.
కేవలం ఉద్యోగాల కోత కాదు… స్టూడియోలకూ గుడ్‌బై
Microsoft ఉద్యోగులను మాత్రమే తగ్గించడం లేదు. తానే గతంలో కొనుగోలు చేసిన పలు ప్రముఖ గేమింగ్ స్టూడియోలను కూడా విడిచిపెడుతోంది. కొన్ని స్టూడియోలను విక్రయిస్తోంది. మరికొన్నింటిని తిరిగి స్వతంత్ర సంస్థలుగా మారే అవకాశం కల్పిస్తోంది.
Ninja Theory, Undead Labs స్టూడియోలను వేరే యాజమాన్యాలకు విక్రయిస్తోంది.
Double Fine, Compulsion Games స్టూడియోలను తిరిగి వాటి పాత వ్యవస్థాపకుల చేతుల్లోకే (స్వతంత్ర సంస్థలుగా) ఇచ్చేస్తోంది.
ఫ్రాన్స్‌కు చెందిన Arkane Studiosను కూడా వదిలించుకోవడానికి చర్చలు జరుపుతోంది.
అంటే… ఒకప్పుడు “ఎక్కువ స్టూడియోలు… ఎక్కువ గేమ్స్…” అనే వ్యూహంతో ముందుకెళ్లిన Microsoft…ఇప్పుడు “తక్కువ స్టూడియోలు… కానీ పెద్ద విజయాలు” అనే వ్యూహాన్ని ఎంచుకుంటోంది.
మరి AIకి దీనికి సంబంధం ఏమిటి?
ఇక్కడే అసలు చర్చ మొదలవుతోంది. Microsoft ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా AI మౌలిక సదుపాయాలపై భారీగా ఖర్చు చేస్తోంది.
కొత్త డేటా సెంటర్లు…
AI చిప్స్…
క్లౌడ్ విస్తరణ…
ఇవన్నీ సంస్థ బడ్జెట్లో కీలక భాగంగా మారుతున్నాయి.
ఇక మరోవైపు…
ఖర్చులను తగ్గించడానికి పాత వ్యాపారాల్లో పునర్వ్యవస్థీకరణ జరుగుతోంది. దాంతో Microsoft ఈ లేఆఫ్‌లకు అధికారికంగా AIనే కారణమని చెప్పలేదు. అయితే… AIపై భారీ పెట్టుబడులు పెరుగుతున్న సమయంలో, ఉద్యోగాల కోతలు కూడా పెరుగుతుండటంతో ఈ రెండింటి మధ్య సంబంధం ఉందా? అనే ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా చర్చకు వస్తోంది.
ఇది Xbox కథ మాత్రమే కాదు
గత రెండేళ్లలో Microsoft మాత్రమే కాదు… పెద్ద టెక్ కంపెనీలన్నీ వేల సంఖ్యలో ఉద్యోగులను తగ్గించాయి. అదే సమయంలో… AIపై పెట్టుబడులు మాత్రం రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఈ పరిణామం చాలా మందిని ఒకే ప్రశ్న అడిగేలా చేస్తోంది.
భవిష్యత్తు కోసం సంస్థలు కొత్త టెక్నాలజీని నిర్మిస్తున్నాయా? లేక… ఆ భవిష్యత్తుకు చోటు కల్పించేందుకు ప్రస్తుత ఉద్యోగాలనే క్రమంగా తగ్గిస్తున్నాయా?
చివరికి మిగిలేది ఒక్క ప్రశ్నే…
చరిత్రలో ప్రతి పారిశ్రామిక విప్లవం… కొన్ని ఉద్యోగాలను తీసుకుంది. మరికొన్ని కొత్త ఉద్యోగాలను సృష్టించింది. అందుకే ప్రతి కొత్త టెక్నాలజీని చివరికి మనిషే గెలిచాడు. కానీ… ఈసారి ప్రత్యర్థి మరో మామూలు యంత్రం కాదు. మనిషిలా , మనిషితో సమానంగా ఆలోచించే యంత్రం.
అందుకే అందరి సందేహం ఒకటే…
రేపు AI మనకు సహోద్యోగిగా పక్కన కూర్చుంటుందా?
లేక… మన కుర్చీలోనే కూర్చుంటుందా?








